శివ.. శివా.. కృష్ణమ్మనూ వదలవా..?

TDP candidate Mandra Sivananda Reddy Sand is Illegal Business in The Krishna River - Sakshi

సాక్షి, నందికొట్కూరు : శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు... నందికొట్కూరులో ఈ నయా ‘శివుడి’ ఆజ్ఞ లేనిదే ఏ ఒక్క పనీ జరగదు. ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఎలాంటి దందా అయినా యథేచ్ఛగా సాగిపోతుంది. అనుచరులు దోచుకోవడానికి, తాను కమీషన్లు దండుకోవడానికి ఏకంగా కృష్ణా నదినే అప్పగించేశారు. ఇంకేం.. వారు ఇసుక దందాకు నందికొట్కూరును కేంద్రంగా మార్చుకుని..కృష్ణమ్మ గుండెల్లో గునపాలు దించుతున్నారు.  తమ కళ్లెదుటే కృష్ణా నదిని లూటీ చేస్తున్నా అధికారులకు మాత్రం కమీషన్లు తప్ప ఏవీ కనపడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. 

నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డికి కృష్ణా నదిలో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా మారడంతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నప్పుడు తన అనుచరులతో ఇసుక వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. వారి నుంచి 40 శాతం కమీషన్లు పుచ్చుకుంటూ అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా అన్నీ తానై వ్యవహరించారు.

దీంతో రెచ్చిపోయిన ‘తమ్ముళ్లు’  కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక దందా సాగిస్తున్నారు. నది స్వరూపమే మారిపోయేంతగా తవ్వకాలు జరుపుతున్నారు. నదిలో ఇసుక తవ్వుకోవడం, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా నందికొట్కూరుకు తీసుకురావడం, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడం పరిపాటిగా మారింది. ఏప్రిల్‌ వచ్చిందంటే చాలు ఇసుక వ్యాపారం మరింత జోరుగా సాగిస్తున్నారు. ఈ సమయంలో నదిలో నీటినిల్వ తగ్గిపోవడంతో వారి పంట పండుతోంది. 

రూ.లక్షల్లో ఆదాయం.. 
నందికొట్కూరులోనే ట్రాక్టర్‌ ఇసుకను రూ.5 వేలకు పైనే అమ్ముతున్నారు. పాములపాడు, ఆత్మకూరు ప్రాంతాల్లో అయితే రూ.8 వేల వరకూ విక్రయిస్తున్నారు. దీంతో పైసా ఖర్చు లేకుండానే లక్షలాది రూపాయలు టీడీపీ నాయకుల జేబుల్లోకి చేరుతున్నాయి. పోలీసులకు కూడా మామూళ్లు ఇస్తూ దందా నిరాటంకంగా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బ్రాహ్మణకొట్కూరు పోలీసులకు నెలకు ఒక ట్రాక్టర్‌పై రూ.2,500 చొప్పున చెల్లిస్తున్నట్లు వినికిడి. అలాగే జూపాడుబంగ్లా పోలీసులకు ఓ ప్రముఖ వ్యక్తి ఒక ట్రాక్టరుపై రూ.2500 చొప్పున చెల్లిస్తున్నాడు. పాములపాడు పోలీసులకు ఒక్కొక్క ట్రాక్టరు యాజమాని రూ.3 వేలు చొప్పున దాదాపు వంద ట్రాక్టర్ల నుంచి రాత్రికి రాత్రే వసూలు చేసి ఇచ్చినట్లు విమర్శలున్నాయి.   

అడుగంటుతున్న భూగర్భజలాలు 
కృష్ణానదిలో ఇసుకను యథేచ్ఛగా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సమీప గ్రామాల ప్రజలు తాగునీటి కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ తెలిసినా పోలీసులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ చర్యలు చేపట్టడం లేదు. అధికార పార్టీ నాయకుని ఒత్తిళ్లు, వాటాలపై మోజుతో వారు మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.  

సరిహద్దులు దాటిస్తూ.. 
వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లు ఇసుక లోడ్‌తో నిత్యం సరిహద్దులు దాటుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పూడూరు, రాళ్లంపాడు, శాతనకోట, మల్యాల, బిజినవేముల, నెహ్రునగర్‌ గ్రామాల పొలిమేరలో ఉన్న కృష్ణానది నుంచి ఇసుకను తీసుకుని సరిహద్దులు దాటిస్తున్నారు. నకిలీ పర్మిట్లు సృష్టించి వందల సంఖ్యలో ట్రాక్టర్లు , టిప్పర్లలో ఇసుకను నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి, మిడుతూరు, గడివేముల, పగిడ్యాల, ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని పలు గ్రామాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇసుకకు డిమాండ్‌ పెరిగిపోవడంతో వీరింకా రెచ్చిపోతున్నారు. ఆ నాయకుని పేరు చెప్పి ప్రస్తుతం రాళ్లంపాడు, పూడూరు నుంచి చోటా మోటా నాయకులతో సహా అడ్డదిడ్డంగా ఇసుకను తవ్వేస్తున్నారు. అధికారులు మాత్రం అడపాదడపా దాడులు నిర్వహించి ‘చేతులు’ దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఒక రాత్రికే వంద ట్రిప్పుల దాకా తరలిస్తున్నారంటే వీరి దోపిడీ ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top