‘అనంత’ టీడీపీ నేతలు కమలం గూటికి!

TDP in the Anantapur district was damaged in the elections - Sakshi

జేసీ బ్రదర్స్‌తో చర్చలు జరిపిన రాంమాధవ్‌

త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్న జేసీ వారసులు

అదే బాటలో పల్లె, వరదాపురం సూరి

పరిటాల కుటుంబంతోనూ చర్చలు.. చేరేందుకు సుముఖత

త్వరలో అమిత్‌షా ఆధ్వర్యంలో ఢిల్లీలో చేరికలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం
రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఇప్పటికే వీరితో సంప్రదింపులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో చేరిక తేదీని ఖరారు చేసుకుని త్వరలోనే వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎదుట కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది.

రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన..
ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హిందూపురం, ఉరవకొండలో మాత్రమే నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌ గెలుపొందారు. 2 పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ విజయ బావుటా ఎగురవేసింది. ఒకపక్క చంద్రబాబు విశ్వసనీయత కోల్పోవడం, మరోవైపు లోకేష్‌ సామర్థ్యంపై నమ్మకం లేని టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై కలవరం చెందుతున్నారు. బంపర్‌ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం ఖాయమనే అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు ప్రత్యామ్నాయం దిశగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పుట్టపర్తి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలు కూడా..
ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరితో కూడా రాంమాధవ్‌ చర్చలు జరిపినట్లు సమాచారం. జేసీ బ్రదర్స్‌ చేరిక తర్వాత వీరు పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 23 లేదా 27న వీరు బీజేపీలో చేరతారని తెలుస్తోంది.

ముందు వరుసలో జేసీ బ్రదర్స్‌
టీడీపీని వీడి బీజేపీలో చేరనున్న నేతల్లో జేసీ బ్రదర్స్‌ మొదటి వరుసలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జేసీ సోదరులు రాజకీయాల నుంచి తప్పుకుని వారసులను బరిలోకి దింపినా వారూ ఓటమి పాలయ్యారు. తమ కుమారులతో చర్చించిన జేసీ బ్రదర్స్‌  టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, తిరిగి అధికారంలోకి రావడం అసంభవం అనే నిర్ధారణకు వచ్చారు. దీంతో తమ వారసులను బీజేపీలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12న అమిత్‌షా ఎదుట వీరు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అపాయింట్‌మెంట్‌ లభించకుంటే త్వరలోనే మరో తేదీ ఖరారు చేసుకుని బీజేపీలో చేరే అవకాశం ఉంది.

పరిటాల కుటుంబంతో చర్చలు సఫలం
పరిటాల కుటుంబం రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2005లో పరిటాల రవీంద్ర హత్య అనంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌ పోటీ చేసి ఓటమి చవిచూశారు. బీజేపీలో చేరేందుకు వీరు కూడా సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నందున హఠాత్తుగా పార్టీ మారితే నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? కేడర్‌ తమతో వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్‌ను ఒప్పించి బీజేపీలో చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్, పల్లె, సూరి చేరికల తర్వాత పరిటాల కుటుంబం బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన నేతలు కూడా టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదని, వారు కూడా ఎవరిదారి వారు చూసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top