చర్చలు విఫలం

Talks fail with 108 ambulance employees - Sakshi

108 అంబులెన్స్‌ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి లభించని స్పష్టమైన హామీ

సమస్యలు పరిష్కరించకపోతే 7 నుంచి సమ్మెలోకి: ఉద్యోగులు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంతో 108 అంబులెన్స్‌ ఉద్యోగుల చర్చలు విఫలమయ్యాయి. వేతనాల పెంపును వెంటనే అమలు చేయడంతో పాటు తాము డిమాండ్‌ చేస్తున్న 56 సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదని 108 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అధికారి ఒకరు శనివారం రాత్రి చర్చలకు వచ్చారని.. అర్థరాత్రి దాటే వరకు సమావేశం జరిగినా స్పష్టమైన హామీ రాలేదని వెల్లడించారు.

56 డిమాండ్లలో ఒక్కదానికి కూడా పరిష్కారం చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మళ్లీ చర్చలకు పిలిచారని తెలిపారు. అప్పుడు కూడా స్పష్టమైన హామీ లభించకపోతే 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. 108 అంబులెన్స్‌ల నిర్వహణ సంస్థ అయిన భారత్‌ వికాస్‌ గ్రూప్‌(బీవీజీ) బెదిరింపులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బెదిరింపులకు ఉద్యోగులెవరూ భయపడరన్నారు. ఒకప్పుడు అద్భుతంగానడిచిన ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు.

తమ డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలేమీ కాదన్నారు. నెలకు రూ.4 వేలు పెంచుతున్నామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నామని.. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. సరైన నిర్వహణ లేక అంబులెన్స్‌లు మూలనపడుతున్నాయని.. ఆక్సిజన్‌ కాదు కదా కనీసం మందులు కూడా ఉండటం లేదన్నారు. వర్షం పడితే అనేక వాహనాల్లో నీరు కారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top