తాడోపేడో తేల్చుకుంటాం... | Tadopedo telcukuntam | Sakshi
Sakshi News home page

తాడోపేడో తేల్చుకుంటాం...

Jul 11 2015 1:24 AM | Updated on Mar 21 2019 7:25 PM

తాడోపేడో తేల్చుకుంటాం... - Sakshi

తాడోపేడో తేల్చుకుంటాం...

కార్మికుల కష్టాలు పట్టించుకోకుండా, సొంత ప్రయోజనాల కోసం కుట్ర పన్నుతున్న భజరంగ్ జూట్ మిల్లు

పట్నంబజారు(గుంటూరు) : కార్మికుల కష్టాలు పట్టించుకోకుండా, సొంత ప్రయోజనాల కోసం కుట్ర పన్నుతున్న భజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకుంటామని జూట్ మిల్లు పరిరక్షణ సమితి అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.  యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను కాదని మిల్లు తెరవకుండా వ్యవహరిస్తున్న తీరుపై పరిరక్షణసమితి సభ్యులు, కార్మికులు శుక్రవారం  జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా, అప్పిరెడ్డి మాట్లాడుతూ యాజమాన్యం మెడలు వంచైనా మిల్లు లాకౌట్‌ను ఎత్తివేసేలా చేస్తామన్నారు. అవసరమైతే ఎంతటి ఆందోళనలకైనా వెనకాడబోయేది లేదన్నారు.

 అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, పలుమార్లు వారించినా ప్రతిఫలం కనబడలేదు. దీనితో విషయం తెలుసుకున్న జిల్లా  కలెక్టర్ కాంతి లాల్‌దండే స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులకు సర్దిచెప్పారు. రోడ్డుపైనే కార్మికులు, పరిరక్షణ సమితి సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం మిల్లులో నెలకొన్న సమస్యలను సమితి సభ్యులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.  కార్మికుల సమస్యలను సావధానంగావిన్న కలెక్టర్ యాజమాన్య మొండి వైఖరిని ప్రభుత్వం, కార్మికశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 5.28 ఎకరాల భూమి విషయంలో కమిషనర్‌తో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కలెక్టర్ హామీతో నేతలు, కార్మికులు ఆందోళన విరమించారు.

 అనంతరం మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మిల్లు యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కించటం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ అవసరమైతే కార్మికులతో కలసి మిల్లు తలుపులు బద్ధలు కొట్టేందుకు కూడా వెనుకాడబోమన్నారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎర్ర జెండాలు వారికి అండగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి సభ్యులు ఎం.భావన్నారాయణ, శృంగారపు శ్రీనివాసరావు, ఎబ్బూరి పాండురంగా అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement