రోహిణి.. తాట తీస్తోంది

Summer Temperature Rises in Prakasam - Sakshi

జిల్లా అంతటా తీవ్ర ఉష్ణోగ్రతలు

నాలుగు మండలాల్లో 46 డిగ్రీల నమోదు

వడగాడ్పుల ప్రభావంతో జనం బెంబేలు

నానాటికీ పెరుగుతున్న జ్వర  పీడితులు

18 మండలాల్లో 43–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు

మూతపడిన దుకాణాలు.. తగ్గుతున్న జన సంచారం

ఒంగోలు సిటీ: జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్నాయి. రోహిణి కార్తె ఎండలు జనం ప్రాణాలను తోడేస్తున్నాయి. బయటకు రావాలంటే భయంతో వణుకుతున్నారు. పసి  పిల్లలను కాపాడుకోవడంలో తల్లిదండ్రుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. వృద్ధుల పరిస్థితి అంతే. నడి వయస్కులే ఎండ బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. ఐదు పది నిముషాలు ఎండలో ప్రయాణిస్తే చాలు ఇక మంచం పట్టినట్టే. మంగళవారం ఉదయం నుంచే వేడి గాలులు మొదలయ్యాయి. జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వెలిగండ్ల మండలం రాళ్లపల్లి, పామూరు మండలం బొట్లగూడూరు, లింగసముద్రం మండలం పెంట్రాల, దొనకొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనం ఎండ ధాటికి తట్టుకోలేక నీరసించిపోతున్నారు.

జిల్లా అంతటా ఇదే పరిస్థితి..
జిల్లా అంతటా ఎండ వేడి తీవ్రంగా నమోదవుతోంది. ఉదయం 5 గంటలకే తెల్లవారుతోంది. ఆరు గంటకల్లా ఎండ వచ్చేస్తోంది. ఉదయాన్నే వ్యాయామం కోసం వెళ్లే వారు, నడకరులు ఎండ తీవ్రతకు సంపూర్ణంగా వ్యాయామం చేయలేకపోతున్నారు. వడదెబ్బకు గురవుతున్న వారితో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పిల్లల ఆసుపత్రుల్లో రోజుకు వందకు తక్కువ కాకుండా ఓపీ వస్తోంది. రోజుల కొద్ది జ్వరంతో ఇబ్బంది పడ్తున్నారు. కుటుంబాల్లో సంపాదనాపరులు ఎండలకు నీరసించి మంచానపడ్తున్నారు. రోజువారీ కూలీలకు వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. చిరు వ్యాపారులకు తగినంత వ్యాపారాలు లేవు. తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసే వారు ఎండ తీవ్రతకు తమ వ్యాపారాలను విరమించుకుంటున్నారు. పూల వ్యాపారులు బాగా నష్ట పోయారు. మార్కెట్‌కు పూలు రావడం లేదు. వచ్చిన కొద్దిపాటి పూల ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. నిమ్మకాయ ధర ఒకటి రూ.4.5పై పలుకుతోంది. పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. శీతలపానీయాలకు గిరాకి బాగా పెరిగింది. పండ్ల రసాల ధరలు అందుబాటులో లేవు. మజ్జిగ ప్యాకెట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమోటాలు కిలో రూ.60 పలుకుతుంది. మిర్చి కిలో రూ.50 ఇలా కూరగాయల ధరలన్నీ విపరీతంగా పెరిగాయి. సామాన్యులకు కూరగాయల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి.

వడగాడ్పులతో బెంబేలు..
జిల్లా వ్యాప్తంగా వడగాడ్పులు తీవ్రంగా ఉన్నాయి. సాయంత్రం వరకు 40–50 కిమీ వేగంతో వడగాడ్పులు నమోదయ్యాయి. రాత్రి వేళల్లోనూ వేడి తగ్గడం లేదు. సాయంత్రానికి కొన్ని మండలాల్లో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. పిడుగులు పడే సూచనలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ప్రధానంగా బేస్తవారపేట, కనిగిరి, వెలిగండ్ల, దొనకొండ, హనుమంతునిపాడు, పీసీపల్లి, దర్శి, పెద్దారవీడు, త్రిపురాంతకం, సీఎస్‌పురం, పామూరు, దోర్నాల, యర్రగొండపాలెంలో పిడుగులు పడే సూచనలు ఉన్నాయని ఆర్టీజీఎస్‌ సూచించింది. ఈ మండలాల్లో తహశీల్దార్లను, వీఆర్వోలను అప్రమత్తం చేశారు.

ఈ  మండలాల్లో 43–45 డిగ్రీల నమోదు..
జిల్లాలోని పెద్దారవీడు, తర్లుపాడు, బేస్తవారపేట, ఉలవపాడు, పొదిలి, జరుగుమల్లి, సంతమాగులూరు, యద్దనపూడి, మర్రిపూడి, కనిగిరి, హనుమంతునిపాడు, టంగుటూరు, జరుగుమల్లి, కందుకూరు,వీవీపాలెంలలో 43–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, కురిచేడు,దొనకొండ, పెద్దారవీడు, అర్ధవీడు, మార్కాపురం, తర్లుపాడు, కొనకొనమిట్ల, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, బల్లికురవ, మార్టూరు, పర్చూరు, కారంచేడు, వేటపాలెం, చీరాల, జె.పంగులూరు, కొరిశపాడు, చీమకుర్తి, మద్దిపాడు, కంభం, బేస్తవారపేట, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, సీఎస్‌పురం, పీసీపల్లి, నాగులుప్పలపాడు, చిన్నగంజాం,కొత్తపట్నం, పామూరులలో  నమోదైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top