నరకయాతన | Sulabh being stench complexes | Sakshi
Sakshi News home page

నరకయాతన

Dec 23 2014 12:53 AM | Updated on Oct 22 2018 7:27 PM

నరకయాతన - Sakshi

నరకయాతన

బహిరంగ మలవిసర్జన సామాజిక నేరమంటూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారాలు చేపడుతున్నాయి.

కంపుకొడుతున్న సులభ్ కాంప్లెక్సులు
అక్కరకురాని వ్యక్తిగత మరుగుదొడ్లు
బాగుకు నిధులు విదల్చని ప్రభుత్వం
మహిళల బహిర్భూమికి చాటు మార్గాలే గతి
సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతర్

 
బహిరంగ మలవిసర్జన సామాజిక నేరమంటూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారాలు చేపడుతున్నాయి. వాస్తవానికి సామూహిక మరుగుదొడ్లు, సులాబ్ కాంప్లెక్స్‌లతో పాటు కనీసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా నిధులు విదల్చకపోవడంతో ముఖ్యంగా మహిళలు బహిర్భూమి అవసరాలకు నరకయాతనకు గురవుతున్నారు. ఇప్పటికీ చాటు మార్గాలను వెతుక్కోవలసి వస్తున్నది. ఇటీవల సుప్రీంకోర్టు బృందం పర్యటనలతో ఉరుకుల పరుగుల మీద ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్లు నిర్మించినా.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేని వారు ఇప్పటికీ జిల్లాలో వేలాది మంది అవమానాలకు గురవుతూనే ఉన్నారు. జిల్లాలో 10.97 లక్షల కుటుంబాలకు కేవలం లక్షా 50వేలకే వ్యక్తిగత మరుగుదొడ్లున్నాయి. మిగిలిన వారంతా సులభ్‌కాంప్లెక్స్‌లు..బహిర్భూమిలనే ఆశ్రయిస్తున్నారు.         
 
విశాఖపట్నం:  జిల్లాలోని ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో 20వేలకుపైగా సులభ్ కాంప్లెక్స్‌లున్నాయి. వీటిలో సుమారు పదివేలకు పైగా శిథిలావస్థకు చేరుకోగా. దాదాపు అన్నింటిలోనూ నిర్వహణ అధ్వానంగానే ఉంది. ఏఒక్క దానిలోనూ ఒక్క మరుగుదొడ్డి కూడా సక్రమంగా ఉన్న దాఖలాలు లేవు. లోపలకు వెళ్తే చాలు ముక్కుపుటాలు అదిరిపోయేలా దుర్గంధం వెలువడుతుంటుంది. వీటిలో మలమూత్ర విసర్జించాలంటే ఏ రోగమొస్తుందోననే భయం వెంటాడుతుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించాలన్న లక్ష్యం నీరుగారిపోతున్నది. జిల్లాలో ఉపాధి హామీలో 2,52,257 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం 7,498 మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేయగలిగారంటే వీటి నిర్మాణం పట్ల అధికారులకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.

ప్రస్తుతం వీటి నిర్మాణ బాధ్యతలు ఆర్‌డబ్ల్యూఎస్‌కు అప్ప గించడంతో మార్చి నాటికి కనీసం 60వేలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇక నుంచి ఏడాదికి లక్ష చొప్పున 2019 అక్టోబర్-2 నాటికి జిల్లాలో ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా బహిరంగ మలమూత్ర విసర్జన లేని జిల్లాగా విశాఖ ను తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే స్థాయిలో అవసరాన్ని బట్టి సులభ్‌కాంప్లెక్స్‌ల సంఖ్యను కూడా పెంచుతామని చెబుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement