సేంద్రియ ఇంటిపంటల ద్వారా సామాజిక మార్పు!

Social change through organic house crops - Sakshi

ఇంటి పంట

వెలుగుబాట చూపుతున్న పంజాబ్‌ యువ జంట

సేంద్రియ ఇంటిపంటల సాగు గౌరవప్రదమైన ఉపాధి పొందడమే కాకుండా.. సమాజంలో సానుకూల మార్పునకు దోహదపడవచ్చని నిరూపిస్తున్నారు ఉన్నత విద్యావంతులైన అనురాగ్, జయతి దంపతులు...  

వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన పంజాబ్‌లో యువత మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుపోయి ఉండటం బహిరంగ రహస్యమే. ఈ ట్రెండ్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టడానికి తన వంతుగా ఏదైనా నిర్మాణాత్మకంగా చేయాలనుకున్నాడు 28 ఏళ్ల అనురాగ్‌ అరోరా. జలంధర్‌ నగరంలో పుట్టిపెరిగిన అనురాగ్‌ ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగాధిపతిగా పనిచేస్తూ.. ఉద్యోగానికి స్వస్తి చెప్పి సామాజిక మార్పు కోసం తపించే వ్యాపారవేత్తగా మారారు.

గత ఏడాది తన భార్య జయతి అరోరాతో కలసి ‘మింక్‌ ఇండియా’ పేరుతో స్టార్టప్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో రెండు విభాగాలున్నాయి. రసాయనిక అవశేషాల్లేని అధిక పోషక విలువలున్న ఆహారాన్ని మేడలపైన ఎవరికి వారు పండించుకొని తినేలా ప్రోత్సహించడానికి మింక్‌ ఆర్గానిక్స్‌ విభాగం పనిచేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి మంచి ఉపాధి మార్గాలను అందిపుచ్చుకునే శిక్షణ ఇవ్వడానికి మింక్‌ ఎడ్యుకేషన్‌ విభాగం పనిచేస్తోంది. ఈ రెండు మార్గాల ద్వారా పక్కదారి పడుతున్న పంజాబ్‌ యువతకు సన్మార్గం చూపాలన్నది అనురాగ్‌ లక్ష్యం.

సేంద్రియ వ్యవసాయంలో ఆధునిక పోకడలపై పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అనురాగ్‌ శిక్షణ పొందటం ద్వారా పని ప్రారంభించారు. ‘‘రసాయనాల్లేకుండా, వర్మీకంపోస్టు ద్వారా, మట్టి లేకుండా కొబ్బరి పొట్టుకు సహజ ద్రవ పోషకాలు జోడించడం ద్వారా టెర్రస్‌ పైన షేడ్‌ నెట్‌హౌస్‌లో సాగు చేస్తున్నాం. మైక్రోగ్రీన్స్, టమాటాలు, వంకాయలు, క్యాబేజి, కాలీఫ్లవర్, ఆనప, సొరకాయలు, ముల్లంగి, ఉల్లిపాయలు, పాక్‌చాయ్, బ్రకోలి వంటి ఆకుకూరలు, చెర్రీ టమాటాలు, సేంద్రియ మొలకలు, సేంద్రియ కూరగాయలు, ముత్యపుచిప్ప పుట్టగొడుగులు మింక్‌ ఆర్గానిక్స్‌ సాగు చేస్తున్నాం.

ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తున్నాం.. తమ మేడపై కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి సేవలందిస్తున్నాం..’’ అని అనురాగ్‌ తెలిపారు. వీటితోపాటు సేంద్రియ గోధుమ నారుతో పొడి, ఎండబెట్టిన పుట్టగొడుగులను కూడా జలంధర్‌ నగరంలో 25 దుకాణాల్లో వీరి ఉత్పత్తులు అమ్మటంతోపాటు అమెజాన్‌ ద్వారా కూడా విక్రయిస్తున్నారు.మైక్రోగ్రీన్స్, పుట్టగొడుగులకు మంచి ఆదరణ లభిస్తోంది. వివిధ రకాల ఆకుకూరలు,నూనెగింజల విత్తనాలను విత్తుకున్న 6–8 రోజుల్లో 2 అంగుళాలు పెరుగుతాయి.

మైక్రోగ్రీన్స్‌ను కత్తిరించి సలాడ్లు, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, సూపులలో వాడుకోవచ్చు. నెల రోజులు పెరిగిన ఆకుకూరల కన్నా ఈ మైక్రోగ్రీన్స్‌ ద్వారా 40 రెట్లు ఎక్కువగా పోషకాలు పొందవచ్చని అనురాగ్‌ తెలిపారు. మైక్రోగ్రీన్స్‌ చిన్న బాక్సుల్లో, లోతు తక్కువ టబ్‌లలోనూ విత్తుకోవచ్చు. రోజుకు రెండు సార్లు నీరు చిలకరిస్తే చాలు. కత్తిరించిన మైక్రోగ్రీన్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకొని 5–8 రోజుల వరకు వాడుకోవచ్చు. అనురాగ్‌ స్టార్టప్‌ ఏడాదిలో మంచి ప్రగతి సాధించింది. 50 కిలోలతో ప్రారంభమైన పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు 4000 కిలోలకు పెరిగింది. మింక్‌ బృందం ఇద్దరి నుంచి ఏడాదిలో ఎనిమిదికి పెరిగింది. ఈ ఉత్సాహంతో పంజాబ్‌లోని అన్ని నగరాలకూ తమ కార్యకలాపాలను విస్తరింపజేయాలని అనురాగ్‌ భావిస్తున్నారు. ముందుచూపుతో అడుగేస్తే సేంద్రియ ఇంటిపంటల సర్వీస్‌ ప్రొవైడర్‌ వృత్తి ద్వారా కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్న అనురాగ్, జయతిలకు జేజేలు!
   

               పుట్టగొడుగులు, చెర్రీ టమాటాలు

   
                              మేడపై షేడ్‌నెట్‌ హౌస్‌లో అనురాగ్‌


     అనురాగ్, జయతిలతో సిబ్బంది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top