వీళ్లింతే.. | sub registrar office in tadepalligudem | Sakshi
Sakshi News home page

వీళ్లింతే..

May 8 2015 2:21 AM | Updated on Sep 22 2018 8:22 PM

ఎక్కడైనా.. ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు జరిగితే.. కొన్నాళ్లయినా ఆయా కార్యాలయాల

 తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్
 కార్యాలయంలో వింత పోకడలు
 ఏసీబీకి దొరికినా ఆగని దందా
 పట్టుబడిన ఉద్యోగులదే హవా
 నిద్ర నటిస్తున్న ఉన్నతాధికారులు
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :ఎక్కడైనా.. ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక  శాఖ (ఏసీబీ) దాడులు జరిగితే.. కొన్నాళ్లయినా ఆయా కార్యాలయాల సిబ్బంది కాస్త భయభక్తులతో ఉంటారు. కొంతకాలమైనా అవినీతి, అక్రమాలకు దూరమవుతారు. కానీ.. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏసీబీ దాడులు జరిగినా, ఉద్యోగులు సస్పెండైనా అక్కడ అవినీతి దందా ఇసుమంతైనా తగ్గలేదన్న ఆరోపణలున్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే కొన్నాళ్ల కిందట అక్కడ ఏసీబీకి పట్టుబడి నేటికీ సస్పెన్షన్‌లోనే ఉన్న ఉద్యోగులు రాత్రిపూట అదే కార్యాలయానికి వెళ్లి వ్యవహారాలు చక్కబెడుతున్న వైనం వివాదాస్పదమవుతోంది.
 
 గత ఏడాది సెప్టెంబర్ 29న రాత్రి తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్  కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రికార్డుల్లోకి చేరని రూ.52 వేలను స్వాధీనం చేసుకున్నారు. అడంగల్, పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తదితర రికార్డులు లేకుండానే ఏలూరు సమీపంలోని వట్లూరులో 30 ఎకరాల భూమిని తాడేపల్లిగూడెం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో  రిజిస్ట్రేషన్ చేయడంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ దాడుల్లో అప్పటి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌ను, సెలవులో ఉండి కూడా ఆ రోజు కార్యాలయానికి వచ్చిన సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్ట్ చేశారు.
 
 ఆ తర్వాత వారిద్దరూ సస్పెండ్ అయ్యారు. అదే సమయంలో ఆ కార్యాలయంలోని మరో ముగ్గురు ప్రైవేటు ఉద్యోగుల దందాపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఇదంతా జరిగిన తర్వాతైనా అక్కడి రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్పు వస్తుందని అందరూ ఆశించారు. కనీసం కొన్నాళ్లయినా మామూళ్ల ప్రస్తావన లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని భావించారు. కానీ ఏసీబీ దాడుల అనంతరమే అక్కడి సిబ్బంది మరింత రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నా అక్కడ మూమూళ్లు ఇవ్వాల్సిందే. రికార్డులు సరిగ్గా లేవంటే ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఒక్కో ధర ఉంటుంది. డాక్యుమెంటేషన్‌లోని లొసుగులను బట్టి రేటు పెరుగుతుంది.
 
 ఈ తంతు జిల్లాలోని చాలా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉందనుకున్నా.. సస్పెండైన ఉద్యోగులు నిర్భీతిగా కార్యాలయానికి వచ్చి వ్యవహారాలు చక్కబెడుతుండటం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఏసీబీ అధికారులకు పట్టుబడి అరెస్టయిన వారిలో ఓ అధికారి ఇప్పుడు ప్రతిరోజూ రాత్రివేళ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మకాం వేయడం వివాదాస్పదమవుతోంది. ఇక ఏసీబీ అధికారుల  విచారణ ఎదుర్కొన్న ముగ్గురు ప్రైవేటు సిబ్బంది కూడా తిరిగి అక్కడ హవా చేస్తుండటం కూడా రిజిస్ట్రేషన్ శాఖలో చర్చకు తెరలేపింది. తాడేపల్లిగూడెంలో ఇష్టారాజ్యంగా సాగుతున్న వ్యవహారాలన్నీ ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులకు తెలియడం లేదా.. లేక ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement