ఇంజినీరింగ్ విద్యపై తగ్గిన మోజు | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ విద్యపై తగ్గిన మోజు

Published Wed, Oct 2 2013 2:37 AM

students are showing interest in engineering stream

రానురాను ఇంజినీరింగ్ విద్యపై మోజు తగ్గుతోంది. ప్రతి ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచదేశాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో  ఆ ప్రభావం ఇంజినీరింగ్ కళాశాలలపై పడుతోంది. ఎంసెట్-13 ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్ పూర్తికాగా కన్వీనర్ కోటాలో జిల్లాలో ఉన్న కళాశాలల్లో 8664 సీట్లకు గాను 4165 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు.
 
 నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్
 ప్రతి ఏడాది ఇంజినీరింగ్ విద్యలో చేరేవారి సంఖ్య భారీగా పడిపోతుంది. ఎంసెట్-2013 రెండవ విడత కౌన్సెలింగ్ కూడా మూడురోజుల క్రితమే పూర్తయింది. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో ఆ ప్రభావం ఇంజినీరింగ్ కోర్సులపై పడింది. ముఖ్యంగా సీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్య ఘోరంగా పడిపోయాయి. జిల్లాలోని చాలా కాలేజీల్లో ఈ కోర్సులో చేరిన వారి సంఖ్య పదికి మించలేదు. ఈ సంవత్స రం ఇంజినీరింగ్ కోర్సుల్లో బాగా చేరింది సివిల్ విభాగంలోనే. అనేకకాలేజీల్లో సివిల్‌సీట్లు72 శాతం భర్తీ అయ్యాయి. దాంతో ఈ విభాగం ప్రథమస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో మెకానికల్, సీఈసీ, ఈఈఈ కోర్సులున్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో కేవలం 22 శాతం అడ్మిషన్లే నమోదయ్యాయి. కోదాడకు చెందిన ఓ ఇంజినీరింగ్ కాలేజీ వారు 42సీట్లతో మైనింగ్ విభాగాన్ని ప్రారంభించగా అందులో ఒకే ఒక్కడు చేరాడు. రాజధాని శివార్లలోని కాలేజీల పరిస్థితి ఒకింత పర్వాలేదనిపించుకోగా, పట్టణ ప్రాంత ఇంజినీరింగ్ కాలేజీల భవిష్యత్తు అయోమయంగా మారింది.
 
 48 శాతం సీట్లే భర్తీ
 జిల్లాలో మొత్తం 40 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 3 మైనార్టీ కాలేజీలు ఉండగా మిగతా 37 కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వీటిల్లో కేవలం 48 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఎంసెట్-2013 ద్వారా ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిపోగా కన్వీనర్ కోటాలో 8664 సీట్లకు గాను 4165 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. 4499 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 52 శాతం సీట్లలో విద్యార్థులు చేరకపోవడం గమనార్హం.
 
 పనిచేయని ‘ఉచిత’ మంత్రం
 ఫీజు రీయింబర్స్‌మెంట్ అవకాశంవున్న విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌లో చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో కొన్ని కాలేజీల వారు ‘ఆల్‌ఫ్రీ’ అనే ఉచిత మంత్రం వేసినా అడ్మిషన్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. యూనివర్సిటీ ఫీజు చెల్లించకుండా తామే చూసుకుంటామని, ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా హాస్టల్, భోజనం వసతులు కల్పిస్తామని ప్రచారం చేసుకున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కాలేజీల వారు ఏజెంట్లను నియమించుకొని విద్యార్థులను చేర్పిస్తే నగదు బహుమతులు కూడా ఇచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కన్వీనర్ కోటాలోనే సగం సీట్లు కూడా భర్తీ కాలేదు.
 
 ప్రవేశాలు తగ్గడానికి కారణాలు  
     ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో జిల్లాకు చెందిన వందలమంది విద్యార్థులు డీమ్డ్ యూనివర్సిటీల్లో, మరికొందరు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చేరిపోయారు.
     అనేక ఇంజినీరింగ్ కాలేజీలు ప్రారంభించినా కొన్నింటిలో సరైన వసతులు లేవు. నైపుణ్యం, బోధనానుభవం గల అధ్యాపకులు లేరు.
     అనుభవం కలిగిన అధ్యాపకులు రెండుమూడేళ్లు రూరల్ ఏరియాలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేసి, సకాలంలో వేతనాలు అందకపోవడం, తదితర కారణాలతో రాజధాని శివారులోని కాలేజీలకు వెళ్లిపోతున్నారు.
     అడ్మిషన్ల విషయంలో ఈ సంవత్సరం నాణ్యతలేని, మంచి ఫ్యాకల్టీ లేని కాలేజీలు దారుణంగా దెబ్బతిన్నాయి.
     ఉపాధి అవకాశాలు తగ్గుతుండటంతో ఎంసెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌లో చేరడానికి ఆసక్తి చూపడం లేదు.
     ఇంజినీరింగ్ కన్నా నైపుణ్యం ఉంటే మామూలు డిగ్రీ చదువులే మేలనే అభిప్రాయానికి తల్లిదండ్రులు రావడంతో డీగ్రీ కోర్సుల్లో చేరిపోతున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement