కబ్జాదారులపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మో పింది. పాయకరావుపేట మండలం పీఎల్‌పురం రెవెన్యూ పంచాయితీ
విశాఖపట్నం : కబ్జాదారులపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మో పింది. పాయకరావుపేట మండలం పీఎల్‌పురం రెవెన్యూ పంచాయితీ పరిధి లో రెవెన్యూ, అటవీశాఖకు చెందిన కొండలను తొలిచేస్తున్న దివీస్ ల్యాబరేటరీ యాజమాన్యం తీరుపై సాక్షిలో వెలువడిన కథనంపై జిల్లా యం త్రాంగం స్పందించింది. వెంటనే విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం ఆర్డీఓ కె.సూర్యారావును జేసీ నివాస్ ఆదేశించారు. 260 ఎకరాలకు యాజమాన్య పత్రాలను చూపించాల్సిందిగా దివీస్ యాజమాన్యాన్ని రెవెన్యూ అధికారుల బృందం నిలదీసింది. డాక్యుమెంట్లపై దివీస్ సిబ్బంది తడబడ్డారు.
దీంతో వ్యవహారం అనధికారికంగా జరుగుతున్నట్లుగా రెవెన్యూ అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. రెవెన్యూ ,పారెస్ట్ శాఖలకు చెందిన కొండలపై చెట్లను ధ్వంసం చేసినవారిపై కేసు నమోదు చేయాలని నమోదు చేయాలని ఆర్డీఓ శనివారం ఆదేశించారు. తహశీల్దార్ ప్రసన్నకుమార్ కబ్జా వ్యవహారంపై పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ ఉన్నతాధికారులు కూడా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. చదును పనులను వెంటనే నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తహశీల్దార్ ప్రసన్నకుమార్ విలేకరులకు తెలిపారు.