సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు కదంతొక్కారు.
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు కదంతొక్కారు. రాష్ట్రం ముక్కలైతే తమ భవిష్యత్తు ఏమిటంటూ ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తించారు. విద్యార్థి గర్జన పేరిట ఆదోనిలో నియోజకవర్గ సమన్వయకర్త వై.సాయిప్రసాద్‌రెడ్డి నాయకత్వంలో దాదాపు 5వేల మంది విద్యార్థులు స్థానిక మున్సిపల్ గ్రౌండ్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి విభజనకు వ్యతిరేకంగా నినదించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆదేశాలతో నంద్యాలలో నలంద, శ్రీనివాస, వెంకటేశ్వర కళాశాలల విద్యార్థులు పద్మావతి నగర్, శ్రీనివాస సెంటర్ మీదుగా సంజీవనగర్ వరకు ర్యాలీ చేపట్టారు. రెండు గంటల పాటు మానవహారం నిర్మించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు.
ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మందికి పైగా యువకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆలూరులో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రాంభీం నాయుడు, మండల కలిసే ఉందాం మహిళా కన్వీనర్ సుభాషిణి, యువజన విభాగం కన్వీనర్ భాస్కర్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టారు. ప్యాపిలిలో పార్టీ నాయకులు శ్రీరామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు జూనియర్ కళాశాల నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రాకపోకలను స్తంభింపజేశారు. మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులు రాఘవేంద్ర సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. ఆ తర్వాత కర్నూలు-రాయచూర్ రహదారిని దిగ్బంధించారు.
కొనసాగుతున్న దీక్షలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నంద్యాలలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భూమా నాగిరెడ్డి ఆదేశాలతో పద్మావతినగర్‌లో పలువురు డ్రైవర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. డోన్ పాత బస్టాండ్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిర్వహిస్తున్న శిబిరంలో వెంకటాంపల్లె గ్రామస్తులు దీక్ష నిర్వహించారు. ప్యాపిలిలో శ్రీరామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏనుగుమర్రి గ్రామస్తులు దీక్ష చేశారు. ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలిలో బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో మాల మహానాడుకు చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు బేతంచెర్లలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.