సమైక్యమే అభిమతం | state united strike contiues on 29th day | Sakshi
Sakshi News home page

సమైక్యమే అభిమతం

Aug 29 2013 4:56 AM | Updated on Mar 18 2019 7:55 PM

సమైక్యమే తమ అభిమతమంటూ ‘అనంత’ వాసులు వెలుగెత్తి చాటుతున్నారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసే అధికారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేనేలేదంటూ తెగేసి చెబుతున్నారు.

అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : సమైక్యమే తమ అభిమతమంటూ ‘అనంత’ వాసులు వెలుగెత్తి చాటుతున్నారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసే అధికారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేనేలేదంటూ తెగేసి చెబుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే చేష్టలుడిగి చూస్తున్న సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు పుట్టగతులు లేకుండా చేస్తామని ప్రతినబూనారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ‘అనంత’లో 29వ రోజైన బుధవారం కూడా ఉద్యమం ఉప్పెనలా కొనసాగింది.
 
 కృష్ణాష్టమి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో యాదవులు, ఇతర వర్గాల వారు సమైక్య ర్యాలీలు నిర్వహించారు. గుడిబండ మండలం కేకేపాళ్యంలో లక్ష్మణ్ణ (38), కణేకల్లు మండలం అంబాపురానికి చెందిన హెచ్. హనుమక్క (58) అనే సమైక్యవాదులు గుండెపోటుతో మృతి చెందారు. అనంతపురం నగరంలో ఉద్యమ తీవ్ర మరింత ఎక్కువైంది. హౌసింగ్ అధికారులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ బస్సుల యజమానులు బస్సులతో ర్యాలీ చేశారు.  ఎన్జీఓ, రెవెన్యూ, జెడ్పీ, పీఆర్, ట్రాన్స్‌కో, వాణిజ్య పన్నుల శాఖ, మున్సిపల్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు, న్యాయవాదులు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సంఘాల జేఏసీ నాయకులు, అధ్యాపకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
 
 ఎస్కేయూలో ఉద్యోగ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య సమితి ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర సదస్సులో కాంగ్రెస్ పార్టీ నేత ఎన్.తులసిరెడ్డి పాల్గొన్నారు. ధర్మవరంలో ఉద్యోగ సంఘాల జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ వర్గాలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. గుంతకల్లులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన నిర్వహించారు. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. హిందూపురంలో తెలుగుతల్లి విగ్రహం చుట్టూ పశువైద్యసిబ్బంది మోకాళ్లపై కూర్చుని మానవహారం నిర్మించారు. చిలమత్తూరులో యాదవులు, లేపాక్షిలో లారీ యజమానులు ర్యాలీలు చేశారు. మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కనబడటం లేదని సమైక్యవాదులు లేపాక్షి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కదిరిలో న్యాయవాదులు, ఉద్యోగ సంఘాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నల్లచెరువు, తనకల్లులో బంద్ కొనసాగింది. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో న్యాయవాదులు, ఉద్యోగ, విద్యార్థి జేఏసీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కుందుర్పి నుంచి కళ్యాణదుర్గం వరకు సమైక్యవాదులు పాదయాత్ర చేశారు. మడకశిరలో సోనియా, కేసీఆర్, రాహుల్‌గాంధీలను సమైక్యాంధ్ర ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉట్టి కొట్టి నిరసన తెలిపారు.
 
 అమరాపురంలో ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడలో ర్యాలీలు హోరెత్తాయి. పెనుకొండలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, పరిగి, గోరంట్లలో సమైక్యవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సోమందేపల్లిలో యాదవులు, రొద్దంలో ఈడిగ కులస్తులు ర్యాలీలు చేశారు. గోరంట్లలో ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాయదుర్గంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గొర్రెలకు సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ చిత్రపటాలు తగిలించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆత్మకూరులో మహిళా సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. బుక్కరాయసముద్రం, నార్పల, గార్లదిన్నె, పామిడి, రాప్తాడు, కనగానపల్లి మండలాల్లో సమైక్యవాదులు, ఉద్యోగ జేఏసీ నేతలు ర్యాలీలు చేశారు.
 
 యల్లనూరులో వంటా వార్పు చేపట్టారు. తాడిపత్రిలో సమైక్యవాదులు సర్వమత ప్రార్థనలు చేశారు. జేఏసీ, మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. యాడికిలో యాదవులు, పెద్దవడుగూరులో ఆటోయూనియన్ సభ్యులు ర్యాలీలు చేశారు. పెద్దపప్పూరులో సమైక్యవాదులు, ఉద్యోగులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఉరవకొండలో రెవెన్యూ, ఉద్యోగ సంఘాల జేఏసీ రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. బెళుగుప్ప, కంబదూరు, విడపనకల్లు, వజ్రకరూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో సమైక్య నినాదాలు మార్మోగాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement