రాజధాని ప్రజలు సంతోషంగా ఉంటే చాలా..? | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రజలు సంతోషంగా ఉంటే చాలా..?

Published Sat, Apr 14 2018 11:08 AM

State Peoples Are Not Happy Cpm Secretary - Sakshi

కడప కార్పొరేషన్‌ :  అమరావతిలో ప్రజలు సంతోషంగా ఉంటే చాలా, రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నా మీకు పట్టదా అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి. నారాయణ సీఎంను ప్రశ్నించారు. స్థానిక కార్పొరేషన్‌ ఎదుట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ ఆధ్వర్యంలో ఏడో రోజు రిలే నిరాహార దీక్షల్లో ఆయన మాట్లాడారు కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషాతో కలిసి ఆయన దీక్షలకు మద్దతు ప్రకటించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు రాష్ట్ర ప్రజలు కోరుకున్నవి కావని, అవి చట్టంలో చేర్చబడిన అంశాలేనన్నారు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ చెప్పారని, తిరుపతి సభలో చంద్రబాబు, మోదీ ఇద్దరూ వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇద్దరూ ప్లేటు ఫిరాయించారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వలేదని, కడప స్టీల్‌ ప్లాంటు గూర్చి అసలే పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తామని ఒక్కటీ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తుంటే ఆనందనగరం పేరిట సంబరాలు చేసుకోవడం దారుణమన్నారు.
ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేయాలని ఈనెల 16వ తేదీ నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా బంద్‌లో పాల్గొనాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో పట్టుబడిన సీఎం హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే హక్కును వదులుకొని, అమరావతికి పారిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కరిముల్లా, ఎస్‌ఏ షంషీర్, చినబాబు, సాయిచరణ్‌ తదితరులు మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌(బూస్ట్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షల్లో మణి, మహేష్‌ తదితరులు కూర్చొన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి అఫ్జల్‌ఖాన్, నాయకులు పాకా సురేష్‌కుమార్, రాజగోపాల్‌రెడ్డి, బోలా పద్మావతి, త్యాగరాజు, సీహెచ్‌ వినోద్, జాషువా, శివప్రసాద్, షఫీ, ఖదీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement