మరో 4నగర పంచాయతీలు

State Government Proposes To Upgrade Grama Panchayats To Urban Panchayats Municipalities - Sakshi

పంచాయతీల స్థాయి పెంచేందుకు ప్రతిపాదనలు

జాబితాలో టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, రణస్థలం

సాక్షి, అరసవల్లి: ఓవైపు గ్రామీణాభివృద్ధి... మరోవైపు పట్టణీకరణ.. ఇలా అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యాలు కల్పించి, జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర సర్కార్‌ సంకల్పించింది. ఇప్పటికే మారుమూల గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ కాగా.. పట్టణ  నాగరికత, వనరులు పెరిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీ/మున్సిపాల్టీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మరోసారి నగర పంచాయతీల అంశం తెరమీదకొచ్చింది. ఈమేరకు జిల్లాలో రాజకీయ, పారిశ్రామిక, ఆర్థిక, సహజ వనరులు, జనాభా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, రణస్థలం గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు పురపాలక శాఖ సన్నద్ధమయ్యింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారులు ఆయా ప్రతిపాదిత పంచాయతీల నైసర్గిక స్వరూపం, జనాభా, అతి సమీప గ్రామ పంచాయతీల్లో ఉన్న జనాభాతోపాటు అసెస్‌మెంట్లు తదితర వివరాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆచరణ సాధ్యంగా మలిచేందుకు ఆయా పం చాయతీ అధికారులు తగు చర్యల్లో నిమగ్నమయ్యారు. 

స్వరూపం మారనున్న ఆ నాలుగు...
జిల్లాలో ప్రస్తుతం వరకు 1141 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో ప్రధానంగా టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, రణస్థలం పట్టణ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు రావడంతో జిల్లాలో చర్చలు జోరందుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఈ నాలుగు పంచాయతీలు రాజకీయ ప్రాధాన్యత గల ప్రాంతాలు కావడంతో అన్ని విధాలుగా అప్‌గ్రేడ్‌ అవ్వనున్నట్లు చెప్పవచ్చు. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం నగర పంచాయతీ లేదా మున్సిపాల్టీగా మార్పు చేయాలంటే కనీస జనాభా 20 వేలకు మించిన పంచాయతీలుగా ఉండాలి. అయితే ప్రస్తుతం ప్రకటించిన నాలుగు పంచాయతీల్లో పాతపట్నం, రణస్థలంలలో 20 వేలలోపు జనాభా ఉండడంతో సమీప గ్రామాలను కలుపుకుని నగర పంచాయతీలుగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈనాలుగు పంచాయతీ కేంద్రాల స్వరూపాలే మారిపోనున్నాయి.

ఈనెల 31లోగా నివేదికలు పంపించేందుకు చర్యలు
జిల్లాలో నాలుగు పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ప్రతిపాదనలు కోరారు. నిబంధనల ప్రకారం ప్రతిపాదిత పంచాయతీకి సంబంధించి జనాభా, ఆదాయం, వనరులు, కోల్పోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, విస్తీర్ణం, సర్వే నెంబర్లు తదితర 13 ప్రొఫార్మాలను ఈనెల 31లోగా పంపించేందుకు చర్యలు చేపడుతున్నాం.

టెక్కలి
జిల్లా కేంద్రం తర్వాత ప్రధాన రాజకీయ కేంద్రంగా టెక్కలినే చెప్పవచ్చు. ఇక్కడ 2001 జనాభా లెక్కల ప్రకారం 28,631 మంది ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 34 వేల వరకు చేరింది. అలాగే ఈ పంచాయతీ కేంద్రంలో 6067 ఇళ్లు ఉన్నట్లు అధికారిక సమాచారం. అయితే టెక్కలికి అతి సమీపంలో చాకిపల్లి, అక్కువరం, బన్నువాడ, రావివలస, కె.కొత్తూరు తదితర పంచాయతీలున్నాయి.
నరసన్నపేట
వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉన్న నరసన్నపేటలో 2001 నాటికి 26,280 మంది జనాభా ఉండగా, ఇప్పుడా సంఖ్య 30 వేలకు పైగా ఉంది. అలాగే 8977 ఇళ్లు ఉండగా, అతి సమీపంగా సత్యవరం తదితర పంచాయతీలున్నాయి.
పాతపట్నం
పాత సిటీగా పేరున్న ఈ పట్టణానికి ఒడిశా సరిహద్దు ప్రాంతంగా చారిత్రక ప్రాధాన్యత ఉంది. 2001 నాటికి 17,247 మంది జనాభా ఉండగా, ప్రస్తుతానికి ఈ సంఖ్య 20 వేలకు పైగా చేరింది. ఇక్కడ 5995 ఇళ్లు ఉండగా, అతి సమీపంగా ప్రహరాజపాలెం, బూరగాం, కోదూరు తదితర గ్రామాలున్నాయి.
రణస్థలం
ఫార్మా కేంద్రంగా పేరున్న రణస్థలం ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉండగా, పలు ఫార్మా పరిశ్రమలు, అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణంతో ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా పేరు ప్రసిద్ధి కానుంది. రణస్థలంతోపాటు జంట ప్రాంతంగా ఉన్న జేఆర్‌ పురంలో జనాభా కలిపి 2001 నాటికి 11,332 మంది కాగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 15 వేలకు పైగానే చేరింది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ స్థిర నివాసాలు చేసుకోవడంతో ఈ ప్రాంతం కొన్నేళ్లుగా విస్తరించింది. అలాగే ఈ జంట ప్రాంతాల్లో ప్రస్తుతానికి 3,062 ఇళ్లు ఉన్నాయి. రణస్థలానికి సమీపంలో రావాడ, కోష్ట తదితర ప్రాంతాలున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top