అచ్చు గుద్దినట్టు..!

Software Engineer Designed Movie Character Toys In Visakhapatnam - Sakshi

అబ్బుర పరిచే సినీ కళాఖండాలు

ఒరిజినల్స్‌ను తలదన్నేలా రూపకల్పన

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సూపర్‌ ప్రతిభ

ఆఇంటికి వెళ్తే..అమరేంద్ర బాహుబలి కత్తి,డాలూ దూసుకొస్తున్నట్లనిపిస్తుంది. 24 సినిమాలో టైమ్‌ ట్రావెలింగ్‌ వాచ్‌.. వర్తమానంలోకి తీసుకెళ్లిపోతుంది.300 యోధులు సినిమాలో వీరులు ఎదురై పలకరిస్తారు..
ప్రెడేటర్‌ సినిమాలోనిమాస్క్‌ భయపెడుతుంది.ఇలా.. ఎటువైపు చూసినా..ఏదో ఒక సినిమా జ్ఞాపకంకళ్ల ముందు కనిపిస్తుంది.సినిమా అనే కళకు ప్రతికళను సృష్టిస్తూ అబ్బుర పరుస్తున్నారు నగరానికి చెందిన సాయి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.

విశాఖసిటీ: అక్కయ్యపాలెంకు చెందిన సరిపల్లి సాయి ప్రస్తుతం హైదరాబాద్‌ టీసీఎస్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సాయికి కళలు, చిత్రలేఖనంపై ఆసక్తి. మూడో తరగతి నుంచే చిన్న చిన్న బొమ్మలు గీయడం ప్రారంభించారు. అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది.ఆర్ట్‌లో విభిన్నత చూపించాలనే ఆలోచనతో నిత్యం కొత్త ప్రయోగాలు చెయ్యడం సాయికి అలవాటుగా మారిపోయింది.

హాలీవుడ్‌ టు టాలీవుడ్‌
2010లో వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన హల్క్‌ సినిమాలో అద్భుతాలు సృష్టించిన గ్రాఫిక్స్‌తో సాయి స్కల్ఫిటింగ్‌ ప్రయాణం ప్రారంభమైంది. ఆ బొమ్మను తయారు చేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు హల్క్‌ తయారు చేసేందుకు సాయికి రెండు నెలల సమయం పట్టింది. సినిమాలో చూపించిన విధంగానే సేమ్‌ టూ సేమ్‌ తయారు చేసేసరికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఔరా అని ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి సాయి తన సినీ రూపాలకు పదును పెట్టారు. హాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాలనే తేడా లేకుండా.. కొత్తగా కనిపిస్తే చాలు వాటి నమూనాల్ని ఆవిష్కరించేస్తున్నారు. భావాలకు రంగులు జోడించి.. చిత్రాలకు రూపమిచ్చి ముచ్చట గొలిపే అద్భుతాల్ని  ఆవిష్కరిస్తున్నారు. కాస్తా దూరం నుంచి చూస్తే.. అవన్నీ.. సినిమాలో వినియోగించిన వస్తువులను సాయి వేలంలో కొనుగోలు చేసుకున్నారేమో అన్నట్లుగా కనిపిస్తుంటాయి. తీరా దగ్గరకెళ్లి చూస్తే కానీ తెలీదు అవి వాటి ప్రతిరూపాలనీ.. ఆ బొమ్మలకు రూపమిచ్చింది సాయేనని. ఎంతో నేర్పు.. ఓర్పుతో బొమ్మల్ని తయారు చేస్తూ.. సహజత్వం ఉట్టిపడేలా చేస్తున్నారు. అందుకే.. ఇతని బొమ్మలు మనసుతో మాట్లాడుతాయి. సినీ ప్రేక్షకుడికి మరోసారి ఫేవరెట్‌ చిత్రాల్ని గుర్తుకు తెస్తుంటాయి.

ఇంట్లో వస్తువులేముడి సరకుగా
సాయి తయారు చేస్తున్న సినిమా నమూనాలకు మార్కెట్లో దొరికే వస్తువులతో పాటు ఇంట్లో నిత్యం వినియోగించే వాటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ వాడిన డాలు ని టీవీ డిష్‌తో తయారు చేశారు. అలాగే మేక్‌ఇన్‌ ఇండియా చిహ్నాన్ని తన కుమారుడు వాడిన ప్లాస్టిక్‌ బొమ్మల్లో ఉన్న వస్తువులతో రూపొందించారు. బాహుబలి ఖడ్గాన్ని ఎం–సీల్, చెక్కతోనూ, 24 సినిమాలో వాచీని పాత వాచీల్లోని పాడైపోయిన పార్టులతో.. ఇలా ప్రతి రూపాన్ని సాధారణ వస్తువులతోనే రూపొందించడం సాయిఆర్ట్‌లో ప్రత్యేకత.

సరదాగా మొదలై..
మనం చూసే బొమ్మల్ని కనిపించే సందేశాలు అంటారు. అందుకే చిత్రకళంటే నాకు ఇష్టం పెరిగింది. క్రమంగా కొత్తగా ఆలోచిస్తూ స్కల్ఫిటింగ్‌ ఆర్ట్‌వైపు దారి మళ్లింది. సినిమాల్లో వినియోగించే విభిన్న వస్తువులు నన్ను బాగా ఆకట్టుకునేవి. అందుకే.. వాటి నమూనాలు తయారు చెయ్యాలనిపించి ఈ ఆర్ట్‌ను ప్రారంభించాను. గాజువాకలోని జింక్‌ స్కూల్‌లో చదివేటప్పుడు డ్రాయింగ్‌ టీచర్‌ జాన్‌రాజు మాస్టర్‌ నుంచి మెలకువలు నేర్చుకున్నారు. సరదాగా మొదలైన నా కళా ప్రయాణం కొత్త పుంతలు తొక్కుతూ అందర్నీ ఆకట్టుకోవడం ఆనందంగా ఉంది.– సాయి సరిపల్లి, కళా నిపుణుడు

సినిమాలో కనిపించినట్లుగానే...
ప్రకృతికి ప్రాణం పోసేలా సాయి కుంచె నుంచి చిత్రాలు జాలువారేవి. చిత్రకళంటే మక్కువ ఉన్నా.. అంతకు మించి ఏదైనా కళలో రాణించాలనే తపన మాత్రం సాయిని వెన్నాడుతూనే ఉండేది. సాధారణంగా సినిమాలు చూస్తున్నప్పుడు అందులో వినియోగించే వస్తువులు, గ్రాఫిక్స్‌ ద్వారా ప్రాణం పోసుకున్న రూపాల్ని చూస్తే ఎవరైనా.. భలే ఉన్నాయని చూసినంత సేపు అనుకొని తర్వాత మరిచిపోతారు. కానీ.. సాయి మాత్రం వాటిని ఎలా తయారు చేసారు.? అలాంటివి మనమెందుకు రూపొందించకూడదనే ఆలోచనలు వచ్చేవి. క్రమంగా వాటిపై దృష్టి పెట్టి ఇప్పుడు అచ్చు గుద్దినట్లు తయారు చేయడంలో అందెవేసిన చెయ్యిలా మారారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top