పలు చోరీ కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.2.40 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు తెలిపారు.
చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్టు
Nov 1 2013 2:26 AM | Updated on Nov 6 2018 4:37 PM
నరసరావుపేట టౌన్, న్యూస్‌లైన్:పలు చోరీ కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.2.40 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, నకరికల్లు ఎస్‌ఐ ప్రభాకర్ బుధవారం రావిపాడు రోడ్డు వైపు వెళుతుండగా జ్యోతినికేతన్ వద్ద పట్టణంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన సాయిజగదీష్, పెద్దచెరువుకు చెందిన వేములశివ, రామిరెడ్డిపేటకు చెందిన మడకా అశోక్, అరండల్‌పేటకు చెందిన పి.శివరామకృష్ణలు అనుమానాస్పదంగా తిరుగుతుండగా..అదుపులోకి తీసుకొని విచారించారు.
గతంలో వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పరిధితో పాటు గుంటూరు పట్టాభిపురం ప్రాంతంలో ఒంటరిగా మహిళలు నడిచివెళుతుండగా ద్విచక్రవాహనంపై వెళ్లి వారి మెడలో బంగారు గొలుసులు అపహరించినట్లు నేరాలను అంగీకరించారు. దీంతో నాలుగు కేసులకు సంబంధించి సుమారు 2 లక్షల 40 వేల విలువ గల చోరీ సొత్తును రికవరీ చేశారు. దొంగతనాలకు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సాయిజగదీష్, శివరామకృష్ణలు ఇంటర్మీడియెట్ చదువుతుండగా, వేముల శివ బీటెక్ చదువుతున్నాడు. మరో నిందితుడు మడకా అశోక్ ఎలక్ట్రిషిన్‌గా పనిచేస్తున్నాడు. వీరు నిత్యం పల్నాడు రోడ్డులోని ఓ కళాశాల వద్ద గల బడ్డీ బంకు వద్ద కలుసుకోవడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. విలాస జీవితాన్ని గడిపేందుకు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని విచారణలో వెల్లడైంది.
ఏడు చోరీలతో సంబంధం..
శివునిబొమ్మ ప్రాంతంలో ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన మక్కెన హరికృష్ణ, మంగులూరి కొండయ్యలు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అందిన సమాచారం మేరకు టూ టౌన్ ఎస్‌ఐ మౌలాషరీఫ్ సిబ్బందితో వలపన్ని పట్టుకున్నారు. వారిని విచారించగా నరసరావుపేట పట్టణ, రూరల్‌తో పాటు పొన్నూరు, భీమవరం గ్రామాల్లో ఏడు చోరీలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు మూడు ద్విచక్రవాహనాలు, 15 సెల్‌ఫోన్లు, టి.వి, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బీటెక్ చదువుతున్న హరికృష్ణ, ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కొండయ్య పట్టణంలోని అరండల్‌పేటలో ఓ గది అద్దెకు తీసుకొని కొంతకాలంగా నివాసం ఉంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు ప్రభాకర్, మౌలాషరీఫ్, వెంకటేశ్వరరావు, ఏఎస్‌ఐ శివయ్య, హెడ్‌కానిస్టేబుల్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement