రుణం | Sakshi
Sakshi News home page

రుణం

Published Thu, Jan 30 2014 2:09 AM

since from six months struggleing for loan

‘రుణం కోసం ఆరు నెలల నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నాం. రేపు రండి.. మాపు రండి అంటూ తిప్పుకుంటూనే ఉన్నారు. ఎన్ని నెలలు తిరగాలి సార్. ఇక మా వల్ల కాదు. రుణం ఇవ్వకుండా ఇలా తిప్పుకోవడం న్యాయమా.. మా పనులన్నీ వదులుకుని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా కనీస కనికరం కూడా లేదు. ఎంత అన్యాయం సార్..’ అంటూ మహిళలు మూకుమ్మడిగా బ్యాంకుపై దండెత్తారు.
 
 ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పట్టణం సూపర్‌బజార్‌రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వ్యవసాయ అభివృద్ధి శాఖ) అధికారుల  నిర్లక్ష్య వైఖరిలపై బుధవారం ఉదయం మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గడువు ముగిసినా బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే.. మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన ఇందిరాక్రాంతి పథం మహిళలకు ఈ బ్యాంక్‌లో రుణాలు మంజూరు చేస్తున్నారు. సుమారు 1200 స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ పరిధిలో ఉన్నాయి. కాగా ఇటీవల కాలంలో రుణాల మంజూరుకు సంబంధించి బ్యాంక్ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు.
 
 గత ఆరు నెలలుగా పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 150 సంఘాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ పూర్తయినా వారికి ఇంత వరకు రుణాలు మంజూరు చేయలేదు. మరో 200 సంఘాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్లు సంబంధిత అధికారుల వద్ద ఉన్నాయి. నిబంధనల ప్రకారం పాత రుణాలు చెల్లించిన వెంటనే వీరికి కొత్తగా రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సుమారు రూ.4కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజి కింద రుణాలు మంజూరు చేయాల్సి ఉంది.
 
 అయితే ప్రస్తుతం బిజీగా ఉన్నామని, మాకు ఇతర పనులు కూడా ఉన్నాయంటూ రుణాల కోసం వెళితే బ్యాంక్ అధికారులు కసురుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కట్టిన రుణాలను కూడా క్రెడిట్ చేస్తూ ఆలస్యంగా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్న కారణంగా మహిళలు నష్టపోతున్నారు.

ఇందిరా క్రాంతి పథం అధికారులు బ్యాంక్‌కు వచ్చినప్పుడు సంఘాల వారు రాలేదని, సంఘాల వారు వచ్చినప్పుడు అధికారులు రాలేదని సాకులు చెబుతూ పదే పదే తిప్పుతుండటంతో ఒక్కసారిగా మహిళలంతా ఏకమయ్యారు. కొత్తపల్లె, సోములవారిపల్లె, నంగనూరుపల్లె, దొరసానిపల్లె తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని స్వయం సహాయకసంఘాల మహిళలంతా తరలి వచ్చారు. వీరంతా బ్యాంక్ ఆవరణలోకి రావడంతో పరిస్థితిని గమనించిన బ్యాంక్ మేనేజర్ అనంతకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ రాఘవేంద్రలు బయటికి వచ్చి వీరితో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, ఈ సమస్య తన దృష్టికి రాలేదని తెలిపారు. వీలైనంత త్వరలో అర్హులకు రుణాలు మంజూరు చేస్తామన్నారు.
 

Advertisement
Advertisement