శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బాధ్యతల నుంచి శ్రీధర్‌బాబును తప్పించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నేతలు బుధవారమిక్కడ గాంధీభవన్‌లో మౌనదీక్ష నిర్వహించారు.
సాక్షి, హైదరాబాద్: శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బాధ్యతల నుంచి శ్రీధర్‌బాబును తప్పించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నేతలు బుధవారమిక్కడ గాంధీభవన్‌లో మౌనదీక్ష నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌తోపాటు నేతలు నిరంజన్, కమలాకరరావు, శ్యాంమోహన్, రాజేశ్వర్ గాంధీభవన్‌లో గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది.
సీఎంను ఉపేక్షించడం బాధాకరం: జీవన్‌రెడ్డి
రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో శాసనసభా వ్యవహారాల బాధ్యతల నుంచి మంత్రి శ్రీధర్‌బాబును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పించడం తెలంగాణ ప్రజలందరినీ కించపరచడమేనని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకున్న నాటి నుంచి ముఖ్యమంత్రి ఎన్నో రకాలుగా ధిక్కరించేలా వ్యవహరించినా, అధిష్టానం ఉపేక్షించడం బాధాకరమన్నారు.
‘ముఖ్యమంత్రి చిత్తూరు పోవాల్సిందే’
మంత్రి శ్రీధర్‌బాబును తప్పించడంపై రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, వీ హనుమంతరావు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇది శాడిస్టు వ్యవహారమని, శ్రీధర్‌బాబుకు భయపడే ఆయనేం ముఖ్యమంత్రి అంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఆయన హైదరాబాద్‌లో ఇల్లు అమ్ముకుని చిత్తూరు పోయే పరిస్థితి ఏర్పడుతుందని పాల్వాయి హెచ్చరించారు.
ఓయూ విద్యార్థుల ఆగ్రహం
రాష్ట్ర శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్చుతూ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉస్మానియా(ఓయూ) విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖ మార్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ, టీజీవీపీ ఆధ్వర్యంలో బుధవారం 50 మంది విద్యార్థులు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు వీరిలో 10 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోపక్క ఓయూ క్యాంపస్‌లో విద్యార్థి నేతలు సీఎం కిరణ్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.