అంగన్‌వాడీ కేంద్రాలు షట్‌డౌన్ | Shutdown of Anganwadi centers | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాలు షట్‌డౌన్

Feb 28 2014 2:42 AM | Updated on Jun 2 2018 8:32 PM

తమ న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరవధిక సమ్మెకు దిగడంతో జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలన్నీ బోసిపోయాయి.

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తమ న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరవధిక సమ్మెకు దిగడంతో జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలన్నీ బోసిపోయాయి. 11 రోజులుగా తలుపులు తెరుచుకోలేదు. ఐసీడీఎస్ చరిత్రలోనే తొలిసారిగా అంగన్‌వాడీలు మహా ఉద్యమాన్ని చేపట్టడంతో హక్కుదారులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం దూరమైంది. లబ్ధిదారుల కోసం ఆ శాఖాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా, కనీసం చర్చలు కూడా జరపకుండా మీనమేషాలు లెక్కిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది.

 దశాబ్దాల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమకు కనీస వేతనంగా పది వేల రూపాయలివ్వాలని, ఉద్యోగ భద్రతతో పాటు పదవీ విరమణ అనంతరం అన్నిరకాల ప్రోత్సాహకాలు కల్పించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్రశాఖ పిలుపుమేరకు జిల్లాలోని అంగన్‌వాడీలు ఈ నెల 17వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వాటి పరిధిలో 4,244 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిద్వారా 21 లక్షల 99 వేల 24 మంది చిన్నారులు, 32 వేల 170 మంది గర్భిణులు, 36 వేల 100 మంది బాలింతలు లబ్ధిపొందుతున్నారు.

వారందరికీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాల్సి ఉంది. అదనపు పౌష్టికాహారం కింద వారంలో నాలుగు రోజులు కోడిగుడ్లను కూడా హక్కుదారులకు అందజేయాల్సి ఉంటుంది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. అయితే వాటికి సరిపడిన గ్యాస్, వంటపాత్రలు ఇవ్వకపోవడంతో ఎక్కువ మంది అంగన్‌వాడీలు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి విడుదలైన నిత్యావసర సరుకులను నేరుగా హక్కుదారులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో 11 రోజుల నుంచి అంగన్‌వాడీలు సమ్మెకు దిగడంతో వాటి సరఫరాకు కూడా ఆటంకం ఏర్పడింది. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య కూడా నిలిచిపోయింది.

 90 శాతానికిపైగా నిలిచిపోయిన సేవలు
 మార్కాపురం అర్బన్, బేస్తవారపేట ప్రాజెక్టులు మినహా మిగిలిన ప్రాజెక్టుల్లో 90 శాతానిగా పైగా అంగన్‌వాడీల సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి వేళలు కూడా పెంచేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు తెరిచే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో మొదటి నుంచి అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. గత ఏడాది జూలైలో మూడు రోజులపాటు అంగన్‌వాడీలు మెరుపు సమ్మె నిర్వహించారు.

 అధికారులు వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు హామీలు అమలుకు నోచుకోకపోవడంతో అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోవడంతో ఉన్నతాధికారుల నిర్ణయంపై సమ్మె ఆధారపడి ఉంది. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వంతో జరిపే చర్చలు కూడా ఫలించడం లేదు. దీంతో అంగన్‌వాడీలు సమ్మెను ఎప్పుడు విరమిస్తారో, అంగన్‌వాడీ కేంద్రాల తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో, హక్కుదారులకు పౌష్టికాహారం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement