
ఇంద్రకీలాద్రిలో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ఆలయ పాలకమండలి.. ఈవోపై ఆధిపత్యం సాధించడానికి రోజు ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రులు మొదలైన రోజు నుంచి చీటికీమాటికీ వివాదం రేపుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోవడంపై భక్తుల్లో తీవ్ర అసహనం నెలకొంది. దీనిని గమనించిన సీఎం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. బుధవారం ఈ విషయంపై సీఎంవో(ముఖ్యమంత్రి కార్యాలయం) అధికారులతో సమీక్షించి.. పాలకమండలిపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారని తెలిసింది. దసరా ఉత్సవాల కన్నా ఆలయంలో వివాదాలే ఎక్కువ ప్రచారంలోకి వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సాక్షి, అమరావతి బ్యూరో: దసరా ఉత్సవాల సందర్భంగా నెలకొన్న వివాదాల నేపథ్యంలో సీఎంవో నుంచి బుధవారం ఉదయం దుర్గగుడి ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబుకు ఫోన్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిత్యం వివాదాలకు కారణం ఏంటని.. మీపై సీఎం చాలా కోపంగా ఉన్నారని.. అధికారులతో కలసి సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. తీరు మారకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలిచ్చినట్లు వినికిడి. ఈ నేపథ్యంతో దసరా ఉత్సవాల తర్వాత పాలకమండలి రద్దు చేస్తారనే ప్రచారం ఇంద్రకీలాద్రిపై వినిపిస్తోంది. ఒకరిద్దరు పాలకమండలి సభ్యులు ఇక తమ పనైపోయిందని వ్యాఖ్యానించడం గమనార్హం.
వివాదాల దసరా..
దసరా ఉత్సవాలు మొదలైన రోజు నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గురువారం మంత్రి నారాయణ రాకతో ఉత్సవ మూర్తికి పంచభోగాలు ఆలస్యం చేశారు. అమ్మవారి నివేదన కంటే ఆలయ అధికారులకు మంత్రి గారి సేవే ప్రాధాన్యం కావడంపై ధార్మికవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పనిని ప్రచారానికి వాడుకోవటం అలవాటైన టీడీపీ నేతలు ఇంద్రకీలాద్రిపై భక్తుల క్యూలైన్లలో మళ్లీ మీరే రావాలి.. అంటూ తెలుగుదేశం పార్టీ ప్రచార ఫ్లెక్సీలు కట్టారు. పాలకమండలి సభ్యుడైన వెలగపూడి శంకరబాబే ఇలా చేయడం గమనార్హం. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాల్సిన పాలకమండలి సభ్యుడే ఇలా చేయటం ఏంటని భక్తులు పాలకమండలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మూలా నక్షత్రం రోజున..
మూలా నక్షత్రం సందర్భంగా పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ఏకంగా ఆలయ చైర్మన్‌ను సోమవారం తెల్లవారుజామున తొలిపూజకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మరోసారి ఉదయం కూడా తన చాంబర్‌కు కూడా వెళ్లకుండా నిలువరించి వివాదానికి కారణమయ్యారు. ఆఖరికి విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీటీడీ తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడంలోనూ వివాదాలే రాజ్యమేలాయి. బోర్డు సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధికారులపై చిందులు తొక్కి ఆగ్రహంగా గుడి నుంచి వెళ్లిపోయారు. అతనితో వచ్చిన అనుచరులు ఆలయ సూపరింటెండెంట్‌ను చొక్కాపట్టుకొని బెదిరించి, కేకలు వేస్తూ ఇంద్రకీలాద్రిపై ‘బోండా గిరి’ ప్రదర్శించి కొండపై ప్రశాంతతకు భంగం కలిగించారు. పాలకమండలి చైర్మెన్‌ను ఈవో మంగళవారం క్యూలైన్‌లో దర్శనానికి రావాలని సూచించడంతో ఆయన గుడిలోనే నిరసన దిగటం, సీఎంకు ఫిర్యాదు చేయాలని పాలకమండలి నిర్ణయించడంతో.. వారికి ఈవోకి మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ఇలా నిత్యం ఏదో ఒక వివాదంతో ఈ ఏడాది పండుగ పర్వదినాలు మొత్తం వివాదాలమయంగా మారి వివాదాల దసరా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.