ఉప్పునీటి మొక్కలకు మళ్లీ ఊపిరి!

Scientists Effort to cultivate again for saltwater plants - Sakshi

కనుమరుగైన జాతులను సాగులోకి తెచ్చేందుకు కృషి 

స్వామినాథన్‌ ఫౌండేషన్, సీఎస్‌ఎంసీఆర్‌ఐ శాస్త్రవేత్తల ప్రయోగాలు

కాకినాడ సమీపంలోని కొబ్బరిచెట్టుపేట వద్ద మూడు రకాల సాగు

సాక్షి, అమరావతి : ‘ఈల కూర పప్పులో కూడా ఉప్పేశావా.. టాట్‌!’.. కోస్తా తీర ప్రాంతాలలో వాడుకలో ఉన్న సామెత ఇది. భార్యతో గొడవ పెట్టుకోవడానికి ఏ కారణం దొరక్కపోతే ఈ సాకుతో పెట్టుకోవచ్చంటారు. ఎందుకంటే ఈల కూర ఆకులే ఉప్పగా ఉంటాయి.. దాన్లో మళ్లీ ఉప్పు వేయాల్సిన పనుండదు కాబట్టి. ఇంత గుర్తింపు ఉన్న ఈ తరహా మొక్కలు మడ అడవులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు నీటి ఆధారంగా పెరుగుతాయి. వీటిని శాస్త్రీయంగా ‘హాలోఫైట్స్‌’ అంటారు. చాలా రకాల మొక్కలు తెరమరుగైనట్లే ఇవి కూడా అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వృక్ష శాస్త్రవేత్తలు తిరిగి ఈ మొక్కను పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ప్రత్యామ్నాయంగానే సాగు
రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు అందుకు నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. కిలో బియ్యం (వరి) పండాలంటే సుమారు 2,800 లీటర్ల నీరు కావాలని శాస్త్రవేత్తలు లెక్కతేల్చారు. ఈ తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారు ఉప్పునీటి భూముల్లోనూ పండే పంటలపై దృష్టిసారించారు. వీటి సాగువల్ల సముద్ర తీరప్రాంత కోతల్ని, తుపాన్లనూ తట్టుకోవచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. 1970లలో అమెరికాలో మొదలైన ఈ హాలోఫైట్స్‌ పంటల సాగు ఇప్పుడు మనకూ వచ్చింది. సెంట్రల్‌ సాల్ట్, మెరైన్‌ కెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ), డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ఇందుకు నడుం కట్టాయి. 

ప్రధానంగా మూడు రకాలు సాగులోకి..
ఉప్పు నీరు పారే భూముల్లో పెరిగే హాలోఫైట్స్‌లో చాలా రకాలు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కొబ్బరిచెట్టుపేట వద్ద ఉప్పునీటి ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా మూడు రకాల మొక్కలను సాగుచేస్తున్నారు. అవి.. పోర్ట్‌రేసియా కోయక్టటా, ఫిమ్‌బ్రిస్టిలిస్‌ ఫెర్గునియా, పాస్పలమ్‌ వజినాటమ్‌ రకాలు. ఇవన్నీ గడ్డి జాతి మొక్కలు. పశుగ్రాసానికి పనికివస్తాయి. శాస్త్రీయ నామాలే తప్ప వీటికి స్థానిక పేర్లు ఖరారు చేయలేదు. ఇవి 180 రోజుల్లో కోతకు వస్తాయి. ఈ గడ్డి రకాలను వాణిజ్య పరంగా సాగుచేయవచ్చా అనే దానిపై ప్రస్తుతం విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మెక్సికో, ఆఫ్రికా తదితర దేశాల్లో చేసిన ప్రయోగాలను బట్టి ఈ రకాల నుంచి ఆయిల్‌ను, జీవ ఇంధనాన్ని, బయోసాల్ట్‌ను కూడా తయారుచేయవచ్చని తేలింది.

ఈ మూడు రకాలు ఉభయతారకం..
ఇవికాక.. సుయోడా మారిటిమా, సేసువియమ్‌ పోర్చులకాస్ట్రమ్, సాలీకోర్నియా బ్రాచియాట రకాలు అయితే అటు తినడానికి ఇటు పశుగ్రాసానికీ పనికి వస్తాయి. వీటినీ ఉప్పు, మంచినీటిలో సాగుచేయవచ్చు. హెక్టార్‌కు 20 టన్నుల వరకు గడ్డి వస్తుంది. సుయోడా మారిటిమా రకాన్ని స్థానికంగా ఈలకూర అని, సేసువియమ్‌ పోర్చులకాస్ట్రమ్‌ను వొంగులేడీ లేదా బుస్కా అని పిలుస్తారు. వీటిని మన పొన్నెగంటి కూర, పాయలాకు, చెంచలాకు, సోయి కూర, తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు మాదిరిగా విడిగా లేదా పప్పులో వేసుకుని వండుకోవచ్చు. రొయ్యల కూరలోనూ కలుపుకోవచ్చు. తీరప్రాంత వాసులైతే అచ్చంగా వీటి లేత ఆకులతో కూర తయారుచేస్తుంటారు. ఆకులు ఉప్పగా ఉండడంవల్ల కూర రుచిగా ఉంటుంది. ప్రత్యేకించి వీటి ఆకుల్లో లవణాలు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

వీటితో విస్తృత ప్రయోజనాలు
కొబ్బరిచెట్టుపేట గ్రామ సమీపంలో పెంచుతున్న ఈలకూర, వొంగులేడి మొక్కలు వాస్తవానికి చాలా ప్రాచీనమైనవి. కాలక్రమంలో కనుమరుగయ్యాయి. ప్రస్తుతం వీటిపై విస్తృత ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. విదేశాల్లో ఈ మొక్కలకు చాలా గిరాకీ ఉంది. ఔషధాల్లోనూ వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లోనూ వీటిని పెంచేలా నారును పోశారు. ఇవి తీరప్రాంత కోతనూ నివారిస్తాయి. మంచిపోషక విలువలున్న ఈ మొక్కల్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
– డాక్టర్‌ రామసుబ్రమణ్యం, స్వామినాథన్‌ ఫౌండేషన్, చెన్నై 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top