రెచ్చిపోతున్న ఇసుకాసురులు

Sand mafia in Guntur - Sakshi

 ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు

నాలుగు ట్రాక్టర్ల సీజ్‌

అక్రమార్కులకు వీఆర్వోలు, కానిస్టేబుళ్ల అండదండలు

ప్రతి రోజు రూ.వేలల్లో అక్రమ వసూళ్లు

తాడేపల్లి రూరల్‌: మండల పరిధిలోని గుండిమెడ, చిర్రావూరు, ప్రాతూరు గ్రామాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఇసుక మాఫియా వేలాది క్యూబెక్‌ మీటర్ల ఇసుకను కృష్ణానది నుంచి దోచుకుంటూ లారీ ఇసుక రూ.20 వేలు, ట్రాక్టర్‌ రూ.5 వేలకు విక్రయిస్తూ పర్యావరణానికి పెను ముప్పు కలిగిస్తున్నారు. ఎట్టకేలకు రెవెన్యూ, పోలీసు అధికారుల్లో చలనం వచ్చి ఒక్కసారిగా ఇసుక క్వారీలు తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు క్వారీకి వెళ్లే సమయానికి అక్కడ ఉన్న 20 ట్రాక్టర్లు మాయమవడం విశేషం. క్వారీలో నుంచి బయటకు వచ్చిన తహసీల్దార్‌ కృష్ణారావు కరకట్ట మీద చిర్రావూరు – గుండిమెడ మధ్య వెళ్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. ఇదే సమయంలో గుండెమెడ శివారులో 10 టైర్ల లారీకి ప్రొక్లయిన్‌తో ఇసుక నింపుతుండగా తహసీల్దార్‌ తనిఖీ చేస్తున్నారని పసిగట్టిన ఇసుక మాఫియా లారీలో ఉన్న ఇసుకను అక్కడే పడేసి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న నాలుగు ట్రాక్టర్లను ఎస్‌ఐ నారాయణకు అప్పగించి కేసు నమోదు చేశారు. అనంతరం తహసీల్దార్‌ కృష్ణారావు ఆర్‌ఐ దుర్గేష్, ఎస్‌ఐ నారాయణ చిర్రావూరు, గుండిమెడ, ప్రాతూరు గ్రామాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.

ఐదు గంటల పాటు తనిఖీలు
తాడేపల్లి మండలంలోని మూడు గ్రామాల పరిధిలో పంట పొలాలను సైతం వదలకుండా తనిఖీలు నిర్వహించగా ఆరు చోట్ల భారీగా ఇసుక నిల్వలున్నట్లు తహసీల్దార్‌ గమనించి ఇసుకను వీఆర్వోల ద్వారా సీజ్‌ చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ నిల్వలపై పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని వీఆర్వోలను కోరారు. ప్రతి ఒక్క ఇసుక నిల్వల వద్ద వీఆర్‌ఏలను కాపాలా ఉంచాలని మైనింగ్‌ వారికి ఫిర్యాదు చేయాలని చెప్పారు. మైనింగ్‌ వారితో నివేదిక తయారు చేయించి సంబంధిత స్థలం యజమానిపైనా ఇసుక నిల్వలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఎస్‌ఐ నారాయణను ఆదేశించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి పహరా ఉంచాలన్నారు. తహసీల్దార్, ఎస్‌ఐలు స్వయంగా తనిఖీలు నిర్వహించారు.

తెలియదంటున్న వీఆర్వోలు
మూడు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాపై తమకు తెలియదని ఆయా గ్రామాల వీఆర్వోలు, వీఆర్‌ఏలు చెబుతుండడం విశేషం. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు తిరుగుతున్నా ఆయా అధికారులు తెలియకపోవడం వెనుక ఇసుక మాఫియాతో ఏవిధంగా కుమ్మక్కయ్యోరో అర్ధమవుతుంది. ఇసుక అక్రమ రవాణాలు నివారించాల్సిన గ్రామ అధికారులు, పోలీస్‌ కానిస్టేబుళ్ల సహకారం కారణంగానే వేలాది టన్నులు ఇసుక అక్రమంగా తరలివెళ్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి తమ జేబులు నింపుకోవడం పట్ల అధికారులు సైతం అసహనం వ్యక్తం చేశారు.

సిబ్బందికి మూముళ్లు
ఇసుక అక్రమ తవ్వకాల్లో రెండు శాఖలకు చెందిన ఐదుగురు సిబ్బంది ఇసుక మాఫియాకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ సిబ్బందితో పాటు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో రాత్రి వేళ జాతీయరహదారి అవుట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అండదండలతోనే ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతుంది. ఇసుక మాఫియా వీఆర్వోలకు ట్రాక్టరుకు రూ.500 చొప్పున ప్రతి రోజు రూ 15 వేలు, ఐదుగురు వీఆర్‌ఏలకు రోజుకు రూ.2500, తాడేపల్లి అవుట్‌పోస్టు సిబ్బందికి రూ.20 వేల చొప్పున మామూళ్లు అందిస్తున్నట్లు ఇసుక మాఫియా బహిరంగంగా  చెబుతుండడం గమనార్హం. పోలీసులు మాత్రం వారిచ్చిన సొమ్ము మొత్తం మాకొక్కరికే కాదు ఉన్నతాధికారులకు ఇస్తున్నాము చెబుతుండడం అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది. ఇప్పటికైనా తాడేపల్లి మండల పరిధిలో జరుగుతున్న ఇసుక మాఫియాను రెవెన్యూ, పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక ట్రాక్టర్‌కు రూ.రెండు లక్షలు జరిమానాకంగుతిన్న ఇసుకాసురులు
 మంగళగిరి: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ని పట్టుకుని సీజ్‌ చేసిన మంగళగిరి తహసీల్దార్‌ రామ్‌ప్రసాద్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.రెండు లక్షలు జరిమానా విధించి సంచలనం సృష్టించారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి చర్యలు తప్పవని తహసీల్దార్‌ పేర్కొన్నారు. తహసీల్దార్‌ ఇసుక ట్రాక్టర్‌కు విధించిన జరిమానా ఇసుక మాఫియాను గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇసుక, మట్టి ఏదైనా మండలంలో అక్రమంగా తిరుగుతూ కనిపిస్తే సీజ్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసు పెట్టి భారీ జరిమానాలు తప్పవని తహసీల్దార్‌ స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా ఇసుక, మట్టి మాఫియా కంగారెత్తుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top