పరిరక్షణ పరుగు | Samaikyandhra Run in Seemandhra Districts | Sakshi
Sakshi News home page

పరిరక్షణ పరుగు

Feb 10 2014 2:03 AM | Updated on Sep 2 2017 3:31 AM

తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన

ఏలూరు, న్యూస్‌లైన్:తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘సమైక్య పరుగు’ ఉరకలెత్తింది. జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో కదంతొక్కారు. సమైక్యాంధ్ర చిహ్నంతో కూడిన టీ షర్టులు ధరించి పరుగులో పాల్గొన్నారు. అన్ని చోట్ల సమైక్య పరుగు విజయవంతమైంది. ఏలూరులో జరిగిన 3కే రన్ నగర ప్రజలను ఉత్తేజితులను చేసింది. ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌వీ సాగర్ , వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్,
 
 టీడీపీ నాయకుడు బడేటి బుజ్జి సమైక్య పరుగులో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాల నడుమ స్థానిక ఇండోర్ స్టేడియం నుంచి ప్రారంభమై ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరింది. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. అక్కడి నుంచి ఓవర్‌బ్రిడ్జి, శ్రీనివాస థియేటర్ మీదుగా పవర్‌పేట స్టేషన్, ప్రభుత్వాసుపత్రి మీదుగా సమైక్య రన్ తిరిగి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుంది. తణుకులో సమైక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 3కే రన్ జరిగింది. ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి రాష్ట్రపతి రోడ్డు మీదుగా పరుగు సాగింది. ఎన్జీవో నాయకులు పీవీ రమణ, వైవై సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 
 
 భీమవరంలో విజయవంతం
 భీమవరంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య 3కే రన్ విజయవంతమైంది. మునిసిపల్ ఉద్యోగులు, సమైక్యాంధ్ర జేఏసీ, విద్యాసంస్థల జేఏసీ, సమైక్యవాదులు, వ్యాపారస్థులు పెద్ద సంఖ్యలో రన్‌లో పాల్గొని సమైక్యవాదాన్ని చాటారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక డీఎన్నార్ కళాశాలలోని గన్నాబత్తుల క్రీడామైదానంలో మునిసిపల్ కమిషనర్ జీవీవీ సత్యనారాయణమూర్తి సమైక్య రన్‌ను ప్రారంభించారు. 
 
 ఎన్జీవో అసోసియేషన్ భీమవరం తాలూకా అధ్యక్షుడు కె.కామరాజు, కార్యదర్శి ఐ.రామచంద్రరాజు, ఏపీ మునిసిపల్ మినిస్టీరియల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, విద్యాసంస్థల జేఏసీ నాయకులు డాక్టర్ చీడే సత్యనారాయణ, ఉద్దరాజు వేణుగోపాలరాజు, చెరకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో 3కే రన్  ఉత్సాహంగా సాగింది. త హసిల్దార్ కార్యాలయం నుంచి సుబ్బారాయుడి గుడి, ఫైర్‌స్టేషన్ సెంటర్,పోలీస్‌స్టేషన్ మీదుగా పెదగోపురం నుంచి గాంధీబొమ్మల సెంటర్ వరకు సాగింది. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, ఎన్జీవోలు గారపాటి గోపాలరావు పాల్గొన్నారు. నర్సాపురం టౌన్ ప్రధాన సెంటర్ల 5కే రన్ ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని ప్రధాన రోడ్డు నుంచి స్టీమర్‌రోడ్డు మీదుగా వైఎన్ కళాశాల రోడ్డు మీదుగా జేఏసీ సెంటర్‌కు చేరుకుంది.
 
 నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్, జేఏసీ కన్వీనర్ అందే రంగారావు, విద్యార్థులు పాల్గొన్నారు. కొవ్వూరు పట్టణంలో 3కే రన్ ఉరకలెత్తింది. సాయంత్రం 4 గంటల నుంచి బస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించి సమైక్యనినాదాలు చేశారు. కొవ్వూరు మెరకవీధి నుంచి బస్టాండ్ నుంచి విజయవిహార్ మీదుగా బస్టాండ్ నుంచి మెరకవీధికి చేరింది. కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ తానేటి వనిత, జేఏసీ నాయకులు పరిమి రాధాకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర రాఘవలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో 5కే రన్ విజయవంతంగా జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి జయలక్ష్మి థియేటర్ వరకు, అక్కడి నుంచి పోలీస్ ఐలండ్ వరకు పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ, పేరిచర్ల మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement