పట్టణంలో సమైక్య నినాదం మార్మోగింది. విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు.
పేటలో మార్మోగిన సమైక్య నినాదం
Feb 6 2014 1:47 AM | Updated on Sep 2 2017 3:22 AM
చిలకలూరిపేట టౌన్, న్యూస్‌లైన్:పట్టణంలో సమైక్య నినాదం మార్మోగింది. విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం సమైక్యాంధ్ర ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు తరలివచ్చారు.
తొలుత ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుదాసు, ఏపీ ఎన్‌జీవోల సంఘం చిలకలూరిపేట అధ్యక్షుడు, డిప్యూటీ తహశీల్దార్ నాంపల్లి నాగమల్లేశ్వరరావులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఎన్‌ఆర్‌టీ సెంటర్ నుంచి బయలు దేరిన ర్యాలీ చౌత్ర సెంటర్, కళామందిర్ సెంటర్, గడియారస్తంభం సెంటర్, అడ్డరోడ్డు సెంటర్ మీదుగా తిరిగి ఎన్‌ఆర్‌టీ సెంటర్‌కు చెరుకుంది. ఎన్‌సీసీ విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. కళామందిర్ సెంటర్‌లో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఐదువేల మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుదాసు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకోవల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీఎన్‌జీవోల సంఘం చిలకలూరిపేట అధ్యక్షుడు ఎన్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ పలువురు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని విమర్శించారు.
పంచాయతీ రాజ్ ఏఈ బి.మోహనరావు మాట్లాడుతూ సీమాంధ్రులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు మనకు కాకుండా పోతాయన్నారు.
ఆర్టీసీ డిపోమేనేజర్ ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ విభజనతో సీమాంధ్ర ఆర్టీసీకి అప్పులు, తెలంగాణ ఆర్టీసీకి ఆస్తులు దక్కుతాయన్నారు.
కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పి.భక్తవత్సలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దండా గోపి, ఏఎంజీ సంస్థ సీఏవో విజయకుమార్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, డి.ధనలక్ష్మి, సాంబశివరావు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి చేబ్రోలు మహేష్, సూదా రమేష్‌బాబు, కృష్ణారావు, అస్లాం, స్థానిక జర్నలిస్టు నాయకులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement