
సాక్షి కథనంతో బాలికకు పునర్జన్మ
సాక్షి కథనం తొమ్మిదేళ్ల బాలికకు పునర్జన్మను ప్రసాదించింది. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న బాలికకు
గుండె చిల్లుతో బాధపడుతున్న బాలికకు ఉచితంగా వైద్యం
విజయవాడ రమేష్ ఆస్పత్రి వైద్య బృందం ఔదార్యం
లబ్బీపేట : సాక్షి కథనం తొమ్మిదేళ్ల బాలికకు పునర్జన్మను ప్రసాదించింది. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న బాలికకు నిరుపేదలైన తల్లిదండ్రులు శస్త్రచికిత్స చేయించలేక తొమ్మిదేళ్లుగా మందులతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ తరుణంలో ఏడాది కిందట రోడ్డు ప్రమాదంలో బాలిక తండ్రి మృతి చెందగా, తల్లి వైద్యం కూడా చేయించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు బైపాస్ చేసేందుకు నగరంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లలేక అచేతన స్థితిలో ఉన్న బాలిక దయనీయస్థితిని ఆగస్టు 24న సాక్షి ప్రచురించింది. ఆ కథనానికి స్పందించిన విజయవాడలోని రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. గత నెల 12న ఆస్పత్రి పిడియాట్రిక్ హార్ట్ సర్జన్ల బృందం విజయవంతంగా గుండె శస్త్రచికిత్స నిర్వహించగా, 22న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. గురువారం వైద్య పరీక్షల కోసం బాలిక రాగా, ఆమెను నిర్వహించిన శస్త్రచికిత్స వివరాలను వైద్యులు తెలిపారు.
పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు
గన్నవరానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుం బంలో పుట్టిన బేవర అఖిల (9) పుట్టుకతోనే కోనో ట్రంకల్ అనామలీతో పాటు గుండెనుంచి ఊపిరితిత్తులకు వెళ్లే ధమనిలో బ్లాకు, ఎల్‌వీ డిస్పంక్షన్ (గుండెకు రెండు రంధ్రాలతోపాటు ఊపిరితిత్తులకు వెళ్లే థమని పూర్తిగా పూడిపోవడం) ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగేది. బాలికకు ఉన్న సమస్య మొత్తానికి ఎన్టీఆర్ వైద్యసేవ పథకం వర్తించకపోవడంతో వైద్యులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సాక్షి కథనం బాలిక జీవితంలో వెలుగులు నింపింది. కొంత వైద్యం ఎన్టీఆర్ వైద్యసేవలో నిర్వహించగా, రమేష్ హాస్పిటల్ యాజమాన్యం రూ. లక్ష వెచ్చించినట్లు తెలి పారు. చికిత్స అందించిన వైద్య బృందంలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.రమేష్‌బాబు, డాక్టర్ పి.ఎన్.ఎస్.హరిత, డాక్టర్ ఎన్.శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ ఆదిలక్ష్మి, డాక్టర్ జ్యోతిప్రకాష్ ఉన్నారు.
అందుబాటులో పిడియాట్రిక్ హార్ట్ సర్జరీలు
మా ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా పిడియాట్రిక్ హార్ట్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో నిరుపేదలు హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లే అవసరం లేకుండా నగరంలోనే నిర్వహిస్తున్నాం.
- డాక్టర్ పి.రమేష్‌బాబు
‘సాక్షి’ మా అమ్మాయికి పునర్జన్మను ప్రసాదించింది
తొమ్మిదేళ్లుగా ఎన్నో ఆస్పత్రులు తిరిగాం. మా ఆర్థిక పరిస్థితిని నిందించుకుంటూ మధనపడడం మినహా ఏమీ చేయలేకపోయాం. సాక్షి కథనం ద్వారా మా అమ్మాయికి పునర్జన్మ లభిం చంది. రమేష్ హాస్పిటల్ యాజమాన్యం రుణం కూడా ఈ జన్మలో తీర్చుకోలేనిది. - రమణ, బాలిక తల్లి