చదువుకు ఫీజు ఎంతైతే అంత చెల్లింపు

Rs 20000 per annum for student accommodation in AP - Sakshi

విద్యార్థి వసతి సౌకర్యానికి ఏటా రూ.20 వేలు 

నూతన మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ ఏడాది (2019–20) నుంచే అమలు

సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు స్థోమత లేని పేద పిల్లలు ఇకపై ఎంత వరకు చదువుకుంటే అంత వరకు అయ్యే మొత్తం ఫీజును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీంతో పాటు వసతి, మెస్‌ ఖర్చులకు సైతం ఏకంగా ఏటా రూ.20 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి శనివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నవరత్నాల్లో భాగంగా పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ విధానంలో మార్పులు చేస్తూ జగనన్న విద్యా దీవెన (రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు – ఆర్టీఎఫ్‌), జగనన్న వసతి దీవెన (మెయింటెనెన్స్‌ ఫీజు – ఎంటీఎఫ్‌) పథకాలను తెచ్చింది.

ఇంటర్‌ మినహా పోస్టు మెట్రిక్‌ కోర్సులు.. ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు ఈ పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాలకు సంబంధించి అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో ‘వైఎస్సార్‌ నవశకం ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ కార్డు జారీ చేస్తారు. విద్యార్థి ఫీజును సంబంధిత కళాశాల ఖాతాకు, వసతి సొమ్మును తల్లి లేదా సంరక్షకుని అకౌంట్‌కు జమ చేస్తారు. ఈ పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది (2019–20) నుంచే అమలు చేయనుండటం అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలకనుంది. 
- జగనన్న విద్యా దీవెన పథకం : అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.
జగనన్న వసతి దీవెన పథకం : హాస్టల్, ఆహార ఖర్చులకు ఐటీఐ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.15 వేలు, డిగ్రీ, ఆపై  వారికి (ఒక్కొక్కరికి) రూ.20 వేలు ఇస్తారు.  
అర్హతలు, అనర్హతలు 
విద్యార్థులు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ కాలేజీల్లో చదువుతుండాలి. 
డే స్కాలర్‌ విద్యార్థులు, కాలేజీ అటాచ్డ్‌ హాస్టల్స్‌ (సీఏహెచ్‌), డిపార్ట్‌మెంట్‌ అటాచ్డ్‌ హాస్టల్స్‌  విద్యార్థులు 75% హాజరు  ఉండాలి. 
కుటుంబీకులకు కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండ కూడదు. ప్రభుత్వ ప్రాయో జిత పథకాల కింద ట్యాక్సీలు, ట్రాక్టర్‌లు, ఆటోలు తీసుకున్న వారికి మినహాయింపు ఉంది. పట్టణ ప్రాంతాల్లో (రెసిడెన్షియల్‌ లేదా కమర్షియల్‌) 1,500 చదరపు అడుగులలోపు సొంత స్థలం కలిగి ఉన్న వారు కూడా అర్హులే. 
దూర విద్య, ప్రైవేట్, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో చదువుతున్న వారు, మేనేజ్‌మెంట్‌ కోటా కింద చేరిన వారు, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్‌ ఉన్న వారు అనర్హులు.
ఆదాయ పరిమితి 
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి. æ కుటుంబానికి 10 ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి ఉన్నప్పటికీ అర్హత. లేదా.. మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాల లోపు ఉంటే కూడా అర్హులే. æ వార్షికాదాయంతో సంబంధం లేకుండా శానిటరీ వర్కర్స్‌ పిల్లలు అర్హులు. 

దరఖాస్తు ఇలా..
ఆయా కళాశాలల యాజమాన్యాలే అర్హుల  వివరాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఆయా విభాగాలకు అప్‌లోడ్‌ చేస్తాయి.
ఆదాయ పరిమితి పెంచినందున తహసీల్దార్‌ ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top