రూ. వంద కోట్లతో జిల్లాలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
కాకినాడ రూరల్ : రూ. వంద కోట్లతో జిల్లాలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో కాకినాడ హోప్‌ఐలాండ్, కోనసీమ ప్రాంతాలను ఇకో టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.70 కోట్లు మంజూరు చేసిందన్నారు. మే 1న కాకినాడ వాకలపూడి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తున్నట్లు యనమల వివరించారు.
మంగళవారం సాయంత్రం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్థానిక ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుతో కలిసి సీఎం శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. యనమల మాట్లాడుతూ కాకినాడ సాగరతీరంలో 50 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. స్వదేశీ దర్శన్ పథకం కింద మంజూరైన రూ. 70 కోట్లు కాకుండా ఇక్కడ రెండు వంతెనల నిర్మాణాలకు మరో రూ.10 కోట్లు మంజూరుకాగా మరో రూ.26కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలిపారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఉన్నారు.
బీచ్‌పార్కు శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన
కాకినాడ రూరల్ : బీచ్‌పార్కు అభివృద్ధి పనుల శంకుస్థాపన ఏర్పాట్లను అంతకు ముందు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ ఆర్డీఓ బి.ఆర్.అంబేడ్కర్, పర్యాటకశాఖాధికారులతో కలిసి పరిశీలించారు. మే 1న సీఎం చంద్రబాబు రూ.35 లక్షలతో చేపట్టే ఈ పనులకు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే శంకుస్థాపన ఏర్పాట్ల ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పుల్ల సుధాచందు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.