‘దారి’ద్య్రం | Sakshi
Sakshi News home page

‘దారి’ద్య్రం

Published Mon, Oct 8 2018 11:49 AM

Road Works Delayed IN Chittoor - Sakshi

జిల్లాలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారా యి. చినుకుపడితే చిత్తడిగా తయారవుతున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. రాకపోకలు సాగించలేక ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తిప్పలు ఎదుర్కొంటున్నారు. నిధులు ఉన్నా సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారవుతోంది. నిధులు ఖర్చు చేయకపోవడంతో వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురించింది. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

చిత్తూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్‌డీఎఫ్‌ (రూరల్‌ డెవలప్‌ మెంట్‌ ఫండ్‌) కింద 2017–18లో 59 పనులు మంజూరయ్యాయి. ఇందులో 31 పనులు పూర్తిచేయగా, 28 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులకు రూ.1948.7 లక్షలు ఖర్చవుతుందని అంచనా. సీఆర్‌ఆర్‌ కింద 363 పనులకుగాను 196 పూర్తయ్యాయి. 167 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సీఆర్‌ఆర్‌ (ఎస్సీ సబ్‌ప్లాన్‌)లో 313 పనులకు 143 పూర్తికాగా, 170 పెండింగ్‌లో ఉన్నాయి. ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌లో 195 పనులకుగాను 115, అంగన్‌వాడీ భవన నిర్మాణాల్లో 856కు గాను 616, పంచాయతీ భవనాలు 587కు 158, ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌ కన్వర్జెన్సీలో సీసీరోడ్లు 12,743 పనులకు 8,455 పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీరాజ్‌ పరిధిలోని పనులు ఏళ్ల తరబడి జరుగుతుండడంతో విమర్శలు వెలువెత్తుతున్నా యి. సీఆర్‌ఆర్‌ ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద మంజూరైన పనుల్లో చిత్తూరు పీఆర్‌ఐ, మదనపల్లె, తిరుపతి పరిధిలో పనులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పంచాయత్‌రాజ్‌ శాఖలోని పీఆర్‌ఐ, పీఐయూ, క్వాలిటీ కంట్రోల్‌ శాఖల మధ్య సమన్వయలోపం ఉండడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రోలింగ్‌ అంతంతమాత్రమే..
జిల్లాలో జరుగుతున్న రహదారులన్నీ నిబంధనల ప్రకారం నిర్మించాలి. తారు రోడ్లకు ఇరువైపులా రోలింగ్‌ చేయకుండా వదిలేస్తున్నారు. తారు రోడ్లలో రెండు పొరలుగా తారు వేయాలి. ఈ పనులు అలా జరగడం లేదు. కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్‌ అధికారులు కుమ్మక్కై నాసిరకమైన రోడ్లను వేస్తున్నారు. తారురోడ్లను రెండు పొరలుగా వేయకపోవడంతో ఎక్కడికక్కడ కొద్దిరోజులకే తారు ఎండ కు కరిగిపోతోంది. పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అదేతీరు..
జిల్లాలో ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా 2017–18 సంవత్సరాల్లో చిత్తూరు, మదనపల్లె, తిరుపతికి గత ఆర్థిక సంవత్సరంలో 12,743 పనులు మంజూరయ్యాయి. వాటిలో 4,288 పనులు పూర్తి చేశారు. ఇంకా 8,455 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది మరో 29 పనులు మంజూరయ్యాయి. మొత్తం 8,484 పనులు ఉండగా, అందులో 838 పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన వాటిలో 2,242 పనులు జరుగుతుండగా, 5,388 పనులు ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. ఈ పనులకు విడుదలైన రూ.1.45 కోట్లలో ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.85 లక్షలు ఖర్చు చేశారు. సకాలంలో నిధులను ఖర్చు చేయకపోవడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లే పరిస్థితి నెలకొంటోంది.

ఆలస్యంగా భవనాల పనులు..
పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల పరిధిలో జిల్లాలో అంగన్‌వాడీ, సీడీపీఓ, వెటర్నరీ, గ్రామపంచాయతీ భవనాలను నిర్మించాలని ప్ర భుత్వం ఆదేశాలిచ్చింది. ఆ పనులకు గాను నిధులు సైతం విడుదలయ్యాయి. క్షేత్రస్థాయిలో ఆ భవనాల పనులు ముందుకు సాగడంలేదు. పం చాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంవల్లే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 856 అంగన్‌వాడీ భవనాలు మంజూరుకాగా అందులో 240 భవనాలు పూర్తి చేశారు. 616 భవనాల పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్‌డీపీ కింద 184 అంగన్‌వాడీ భవనాలు మంజూరవగా అందులో 126 పూర్తి చేశారు. 58 పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామపంచాయతీ పనుల్లో 587కు గాను 429ని పూర్తి చేశారు. 158 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా యంత్రాంగం, జెడ్పీ సీఈఓ పనులపై సమీక్షలు, పర్యవేక్షించకపోవడం వల్లే ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

నాకు తెలియదు...ఈఈలను అడిగి తెలుసుకోండి
పనుల పెండింగ్‌ వివరాలు నాకు తెలియదు.  మండలాల ఈఈలను అడిగి తెలుసుకోండి. వారు అక్కడ సమస్యలను చెబుతారు. సీసీ రోడ్లు లక్ష్యం మేరకు పనులు నిర్వహించాం.
–అమరనాథరెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ

Advertisement

తప్పక చదవండి

Advertisement