యువకుడిని బలిగొన్న బస్సు | Rider dies in crash between motorbike and bus | Sakshi
Sakshi News home page

యువకుడిని బలిగొన్న బస్సు

Dec 31 2013 12:47 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఆర్టీసీ బస్సు ఓ యువకుడిని బలిగొంది. వేగంగా వస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సు ఓ యువకుడిని బలిగొంది. వేగంగా వస్తూ బైకును ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని కేసారం బస్‌స్టేజీ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన అంతయ్య చిన్న కుమారుడు నర్సింలు సెంట్రింగ్ పనులు చేస్తూ చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలోని పెద్దమ్మ వద్ద ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం ఆయన పనులు ముగించుకొని మల్కాపూర్‌కు బైకుపై వెళ్తున్నాడు.
 
 మార్గంమధ్యలోని కేసారం బస్‌స్టేజీ సమీపంలో హైదరాబాద్ నుంచి చేవెళ్లకు వస్తున్న వికారాబాద్ డిపోకు చెందిన బస్సు అతివేగంగా ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు బస్సు చక్రాల కిందపడిపోవడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బస్సును ఠాణాకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement