బీఎస్సార్‌కు రివర్స్‌ పంచ్‌

Reverse punch to BSR Infratech Limited - Sakshi

పోలవరం ఎడమ కాలువ 6ఏ ప్యాకేజీ పనులను గతంలో రూ.196.20 కోట్లకు దక్కించుకున్న నామా సంస్థ 

ఎన్నికలకు ముందు 60సీ నిబంధన కింద రూ.70.29 కోట్ల మేర పనుల తొలగింపు

వాటి వ్యయం రూ.153.46 కోట్లకు పెంచి.. బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌కు అప్పగింత 

తాజాగా నిపుణుల కమిటీ సూచన మేరకు కాంట్రాక్టు ఒప్పందం రద్దు.. రివర్స్‌ టెండరింగ్‌ 

సాక్షి, అమరావతి: పోలవరం ఎడమ కాలువ 6ఏ ప్యాకేజీలో బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుని, దానికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడానికి పోలవరం ప్రాజెక్టు సీఈకి అనుమతిస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
- పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో ఆరో ప్యాకేజీ పనులను రూ.196.20 కోట్లకు 2005లో నామా నాగేశ్వరరావు సంస్థ దక్కించుకుంది. 
- 2018 నాటికి రూ.112.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఈ సంస్థకు ధరల సర్దుబాటు కింద రూ.11.45 కోట్లను అదనపు బిల్లుగా టీడీపీ సర్కార్‌ చెల్లించింది. 
- కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం నామా సంస్థ రూ.83.72 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. 
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ పనుల్లో రూ.70.29 కోట్ల విలువైన పనులను ఏపీడీఎస్‌ఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ డిటెయిల్డ్‌ స్టాండర్డ్‌ స్పెసిఫికేషన్స్‌)లో 60సీ నిబంధన కింద తొలగించింది.
- వాటి వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచి.. రాజమండ్రికి చెందిన టీడీపీ నేత, తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌కు నామినేషన్‌ పద్ధతిలో అప్పటి ప్రభుత్వ పెద్ద కట్టబెట్టారు. 
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల ప్రక్షాళనకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ టీడీపీ సర్కార్‌ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తప్పుబట్టింది.
బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌కు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టిన పనుల ఒప్పందాన్ని రద్దు చేసి.. దానికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని సర్కార్‌కు సూచించింది. 
- ఈ మేరకు 6ఏ ప్యాకేజీ కాంట్రాక్టు ఒప్పందాన్ని ప్రీ–క్లోజ్‌ (ముందుగా రద్దు) చేసుకుని, రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ పోలవరం సీఈ పంపిన ప్రతిపాదనలకు సర్కార్‌ ఆమోద ముద్ర వేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top