ఇక రిజర్వేషన్ల కుస్తీ..!

Reservations For Grama Panchayat Polls - Sakshi

పంచాయతీల్లో ముగిసిన కులగణన

సిద్ధమవుతున్నరిజర్వేషన్‌ డ్రాఫ్టింగ్‌ 

ప్రకటన రేపు అభ్యంతరాలపై మరోసారి సమగ్ర పరిశీలన

గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి ప్రాథమికంగా 8,910 పోలింగ్‌ బూత్‌లు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పల్లె పోరుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాం గం అంతా బిజీ బిజీగా ఉంది.  ఓటర్ల జాబితా మొదలుకొని కులగణన ప్రకియ వరకు  వివిధ దశల్లో నిర్వహించాల్సి న కార్యక్రమాలను  పూర్తి చేసింది. ఇక రిజర్వేషన్ల ప్రక్రియపై కుస్తీ ప్రారంభించింది. గురువారం దీనిపై ప్రకటన విడుదలజేయనుంది. మరో వైపు అధికారులు పోలింగ్‌ స్టేషన్ల ఎంపిక ప్రకియపై దృష్టి సారించారు. అన్ని వసతులున్న కేంద్రాలను ఎంపిక చేయాలని కలెక్టర్‌ నుంచి అధికారులకు అదేశాలు అందడంతో గుర్తింపు ప్రకియ ప్రారంభమైంది.
 
జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పంచాయతీల్లో 8910 వార్డులున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ మేరకు రెండు నెలల కిత్రం జరిగిన సార్వత్రిక ఎన్నికలఓటర్ల జాబితా ప్రామాణికంగా గ్రామ పంచాయతీని ఒక యూనిట్‌గా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. నిబంధనల మేరకు గ్రామ పంచాయతీలు, రద్దీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు.

ఈ మేరకు జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో 16,45,439 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మే 20 వరకు గ్రామంలో నివసిస్తున్న ఓటర్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటించారు. ఆత్మకూరు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట డివిజన్ల వారీగా ఉన్న పంచాయతీల్లోని వార్డుల్లో గల ఓటర్ల జాబితాలను ప్రకటించారు. ఈ ప్రకియ ముగిశాక కులగణనపై కసరత్తును నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి కులగణన ప్రకియను చేపట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపే కీలకంగా దీన్ని నిర్వహించారు. ఈ నెల మొదటి వారం వరకు దీన్ని నిర్వహించి తుది జాబితాతో ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలో కులగణనపై కొన్ని చోట్ల నిర్వహించిన గ్రామసభల్లో అభ్యంతరాలు రావడంతో మళ్లీ కసరత్తు చేశారు. 

అందిన డ్రాఫ్ట్‌ కాపీలు
ఇందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి డ్రాఫ్ట్‌ కాపీలు మంగళవారం అందాయి. బుధవారం పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కులగణన అధారంగా పంచాయతీల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గురువారం గ్రామాల వారీగా రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. దీనికి అనుగుణంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ప్రకియపైనా అధికార గణం దృష్టి సారించింది. ప్రాథమికంగా ఒక్కో వార్డులో ఒక్కో బూత్‌ చొప్పున 8910 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
 
గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే మూడు దశల్లో ఎన్నికలు
కులగణన పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే ఎన్నికల సంఘం రంగంలోకి దిగుతుంది. దీనికి అనుగుణంగా మండలం లేదా రెవెన్యూ డివిజన్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని సిద్ధం చేసే అవకాశం ఉంది. జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పరిశీలనకు పంపారు.
 
ఇలా జరిగేందుకు అవకాశం..
మొదటగా కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లలోని 19 మండలాల్లో గల 360 పంచాయతీల పరిధిలో 3406 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో నెల్లూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 12 మండలాల్లో గల 234 గ్రామ పంచాయతీల పరిధిలోని 2346 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని 15 మండలాల్లో 346 గ్రామ పంచాయతీల్లో 3158 వార్డుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top