రోజూ స్కూళ్లు, హాస్టళ్ల సందర్శన తప్పనిసరి 

Regular visits to schools and hostels are a must - Sakshi

మధ్యాహ్న భోజనం, నాడు–నేడు తీరుతెన్నులు పరిశీలించాలి 

మహిళా సంఘాలు, గ్రామ సంఘాల సమావేశాలకు హాజరు కావాలి 

జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, పింఛన్‌ దరఖాస్తులను పరిశీలించాలి 

గ్రామ సచివాలయ సంక్షేమం–విద్య అసిస్టెంట్‌ జాబ్‌ చార్ట్‌ విధులివే  

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వారీగా ఏ ఉద్యోగి.. ఏ రోజు.. ఏ నెలలో.. ఏ విధులు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ చార్టులను రూపొందించింది. ఈ ఉద్యోగుల్లో  గ్రామ సచివాలయ సంక్షేమం–విద్య అసిస్టెంట్‌ కీలక పాత్ర పోషించనున్నారు. గ్రామ సచివాలయ సంక్షేమం–విద్య అసిస్టెంట్‌ రోజూ స్కూళ్లు, హాస్టళ్ల పర్యటనకు వెళ్లాలి. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, పెన్షన్‌ దరఖాస్తుల పరిశీలనతోపాటు ఆ డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.  

గ్రామ సచివాలయ సంక్షేమం–విద్య అసిస్టెంట్‌ విధులు ఇలా.. 
- రోజూ ఉదయం గ్రామ సచివాలయానికి రాగానే వివిధ వర్గాల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత విభాగాలకు పంపాలి. అనంతరం స్పందనలో వచ్చిన సమస్యల పరిష్కారంపై సహచర ఉద్యోగులతో సంప్రదింపులు చేయడంతోపాటు తన పరిధిలో అభివృద్ధి పనులపై చర్చించాలి. 
తన పరిధిలోని స్కూళ్లు, హాస్టళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించాలి. అలాగే నాడు–నేడు కింద చేపట్టిన పనుల పురోగతితోపాటు పనుల నాణ్యతను తెలుసుకోవాలి.  
- బ్యాంకులకు వెళ్లి డ్వాక్రా సంఘాలు, గృహాల లబ్ధిదారులకు రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. 
- సాధారణ విధులతోపాటు పంచాయతీ కార్యదర్శి, ఇతర పై అధికారులు చెప్పే పనులు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక కార్యక్రమా
లన్నింటికీ హాజరు కావాలి.  
మధ్యాహ్నం నుంచి సచివాలయంలో సంబంధిత ఫైళ్లను పరిష్కరించడంతోపాటు ఆన్‌లైన్‌ సర్వీసులు, మాన్యువల్‌ సర్వీసులకు అందుబాటులో ఉండాలి. 
- వైఎస్సార్‌ బీమా క్లెయిమ్స్‌ డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. డ్వాక్రా సంఘాల రుణ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. 
- వైఎస్సార్‌ పెళ్లికానుక దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు నిర్వహించడంతోపాటు డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేయాలి. సంక్షేమ కార్పొరేషన్ల నుంచి ఆయా వర్గాలకు రుణాలను మంజూరు చేయించాలి. 
- గృహ నిర్మాణాలను పరిశీలించడంతోపాటు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. 
- జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీతోపాటు, జగనన్న అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి.  
- పింఛన్‌ దరఖాస్తులను పరిశీలించడంతోపాటు డిజిటల్‌ అసిస్టెంట్‌ సహకారంతో అన్ని పథకాలు, కార్యక్రమాల వివరాలను అప్‌డేట్‌ చేయాలి. 
- డ్వాక్రా సంఘాలు, గ్రామ సంఘాల సమావేశాలకు హాజరవ్వాలి. అలాగే స్వయంఉపాధి యూనిట్లను సందర్శించాలి. 
- పింఛన్‌ డబ్బుల పంపిణీని పర్యవేక్షించడంతోపాటు ఏమైనా సమస్యలుంటే గ్రామ వలంటీర్లతో కలిసి పరిష్కరించాలి. – చదువులో వెనుకబడిన, లేదా తరచూ గైర్హాజరు అవుతున్న, స్కూల్‌కు రావడం మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలి. 
- ప్రతి నెలాఖరున పౌరహక్కుల రోజును నిర్వహించాలి. అంటరానితనం, బాల కార్మిక వ్యవస్థ, జోగిని వ్యవస్థల నిర్మూలనకు ప్రజలను చైతన్యపరచాలి. 
- స్కూళ్ల తల్లిదండ్రుల కమిటీల సమావేశాలను నిర్వహించడంతోపాటు అన్ని సంక్షేమ పథకాలకు చెందిన లబ్ధిదారుల దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top