కుండపోతగా కురిసిన వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. జిల్లా కేంద్రమైన కాకినాడ, రాజమండ్రి నగరాలతోపాటు,
తడిసిముద్దయిన కాకినాడ,
రాజమండ్రి నగరాలు
మెట్ట ప్రాంతాల్లోనూ కుండపోత
లోతట్టు ప్రాంతాలు జలమయం
అమలాపురం :కుండపోతగా కురిసిన వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. జిల్లా కేంద్రమైన కాకినాడ, రాజమండ్రి నగరాలతోపాటు, మెట్టలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో కాకినాడ నగరం జలమయమైంది. మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు, పీఆర్ కాలేజీ రోడ్లు ఏరులను లపించాయి. రోడ్డుపై మోకాలు లోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలు, కార్లలోకి నీరు చేరింది. కాకినాడ నగరంలోని పర్లోవపేట, దుమ్ములుపేట, మహాలక్ష్మినగర్, ముత్తానగర్‌లు ముంపుబారిన పడ్డాయి. జె.రామారావుపేట శివారు సైతం ముంపుబారిన పడింది.
డ్రైన్లు పొంగి పొర్లి, వర్షపు నీటితో కలిసి కాలనీలను ముంచెత్తాయి. తాగునీటి పైప్‌లైన్ల కోసం ప్రధాన రహదారులు, కాలనీలకు వెళ్లే దారులను ఇటీవల తవ్వేసి వదిలేశారు. ఎక్కడి మట్టి అక్కడే వదిలేయడంతో రోడ్లన్నీ బురదగా మారాయి. కాకినాడ రూరల్‌లోని పలు కాలనీలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజమండ్రి నగరంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురిసింది. శ్యామలా సెంటర్, ఆల్కాట్‌తోట, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, తాడితోట, తుమ్మలావ, ఆర్యాపురం, పేపర్‌మిల్లు రోడ్, కంబాలచెరువు హైటెక్ బస్టాండ్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లో నీరు చేరడంతో పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కొన్నిచోట్ల మగ్గాలు నీటమునిగాయి.
మెట్టప్రాంతానికి మేలు
కాగా, ఈ భారీవర్షం మెట్ట ప్రాంతానికి మేలు చేసింది. తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఏకధాటిగా వర్షం కురిసింది. పుష్కర జలాలు, బోర్ల మీద ఆధారపడి నారుమడి వేసి దమ్ముల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ భారీ వర్షం మేలు చేసింది. సోమవారం కూడా కొద్దిపాటి వర్షం పడితే మెరక దుక్కులు దున్ని, నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఏజెన్సీలోని రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో సైతం ఉదయం ఒక మోస్తరు వర్షం కురిసింది. కోనసీమలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం కురిసింది. వాతావరణం మేఘావృతమై చిరుజల్లులు పడ్డాయి.