వామ్మో...! రైల్వే ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌

Railway Ticket Price Increased In Dussera Festival - Sakshi

సాక్షి, రాజమహేద్రవరం: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వేప్లాట్‌ ఫామ్‌ టిక్కెట్‌ ధరను అమాంతం రెండింతలు పెంచుతూ రైల్వేశాఖ బాదుడు షురూ చేసింది. దక్షిణమధ్య రైల్వేలో ప్రధాన నగరాలైన విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరాల్లో ఆదివారం నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకూ ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధర పెంచుతూ  ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకూ 10 రూపాయలు ఉన్న ఈ ధర ఆదివారం నుంచి రెండితలు పెరిగి రూ.30 అయింది. దీంతో ప్రస్తుత రేటుకు రూ.20 అదనంగా భారం పడనుంది.

బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
ప్రతి ఏటా ఇలా పెంచడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. రైల్వేస్టేషన్‌ ఆవరణలోకి వెళ్లే వారు ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ కొనుగోలు చేయాలంటే రూ.30లు చెల్లించాల్సిందే. అదే ప్లాట్‌పామ్‌ పైకి వెళ్లాల్సిన వ్యక్తి పక్కనే ఉన్న ద్వారపూడి రైల్వేస్టేషన్‌, కొవ్వూరు రైల్వేస్టేషన్‌ కో ప్యాసింజరు టిక్కెట్‌ కొనుగోలు చేస్తే దాని ధర రూ.10లే. ప్యాసింజరు టిక్కెట్‌ ధరలో మార్పు లేకుండా ఇలా ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధరను అమాంతం పెంచడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారిపై భారం పడనుంది.

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌కు రెండు గంటలు చెల్లుబాటు పరిమితిని విధించారు. రూ.10లతో ప్యాసింజరు టిక్కెట్‌ కొనుగోలు చేసి ప్లాట్‌ఫామ్‌పైకి వెళితే 3 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇదేం చిత్రమో తెలియదు గానీ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికి రూ.30లు పెట్టి టికెట్‌ కొనుగోలు చేస్తే కేవలం 2 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుందట. ప్రతి రోజూ ప్లాట్‌ఫామ్‌ టికెట్లు 2,500 విక్రయిస్తుండగా...పండుగ రోజుల్లో 5000 వరకు విక్రయిస్తుంటారు. అంటే ఐదు వేల మంది ప్రయాణికులపై ఈ భారం పడనుంది.  

గోదావరి రైల్వే స్టేషన్‌లో పాత ధరే...
దసరా పేరుతో రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ బాదుడు అమలు జరుగుతుండగా గోదావరి రైల్వే స్టేషన్‌లో మాత్రం ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధర మాత్రం రూ.10లు మాత్రమే ఉంటుందని రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ కల్యాణ్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top