ఓట్ల కోసమే రుణ మాఫీ | Raghavulu takes on TDP | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసమే రుణ మాఫీ

Jul 21 2014 1:38 AM | Updated on Aug 13 2018 8:10 PM

ఓట్ల కోసమే రుణ మాఫీ - Sakshi

ఓట్ల కోసమే రుణ మాఫీ

రుణాలు మాఫీ చేస్తామన్న హామీ ఓట్ల కోసమే తప్ప, రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు.

 సాక్షి, న్యూఢిల్లీ:
 రుణాలు మాఫీ చేస్తామన్న హామీ ఓట్ల కోసమే తప్ప, రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు.  రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు ఆదివారం ముగిశాయి. అనంతరం రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రుణ మాఫీ హామీ ఇచ్చింది ఎవరైనా ఇందుకోసమే. ఓట్లు సంపాదించుకుని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తున్నారు. ఈరోజు రుణాలు రీషెడ్యూల్ చేయడమే గొప్ప విషయమనిచంద్రబాబు చెబుతున్నారు, అది రైతులను అపహాస్యం చేయడమే. వాగ్దానం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రుణ మాఫీ హామీని నిలబెట్టుకుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల విధానాల సమాచారాన్ని పొలిట్‌బ్యూరోకు అందజేసినట్టు చెప్పారు. ‘‘రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణా జలాల విడుదల వంటి అంశాలు చాలా వివాదాస్పదంగా మారాయి. తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు రాకుండా బహిరంగ విమర్శలు మానుకుని ఇద్దరు ముఖ్యమంత్రులూ చర్చించుకోవాలి.  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. హైదరాబాద్‌లో శాశ్వతంగా స్థిరపడిన వారిని తెలంగాణ వారిగానే గుర్తించాలి. కాబట్టి 1956 ముందు ఉన్న వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందనడం సరికాదు. అర్హతను నిర్ధారించుకునేందుకు రెండు ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి’’ అని సూచించారు. ‘‘కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో ఆశలుపెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు పాశ్చాత్య శక్తులకు, విదేశీ పెట్టుబడి సంస్థలకు నమ్మినబంటుగా పనిచేస్తోందని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులతో దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలుగుతుంది. బీజేపీకి చెందిన సంఘ్‌పరివార్ సైతం దీనిపై ప్రకటన ఇచ్చే స్థితి ఉందంటే బీజేపీ ప్రభుత్వ పోకడలు ఎమిటో అర్థమవుతోంది. కార్మిక చట్టాలను సవరించాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. భూసేకరణ చట్టాన్ని సైతం సవరించి రైతులకు అన్యాయం చేయాలని చూస్తోంది. చివరకు నచ్చిన వారికే సుప్రీంకోర్టు జడ్జిల పదవులివ్వడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. వీటన్నింటిపై ఆందోళన కార్యక్రమాలపై వచ్చే నెల 9, 10 తే దీలో జరిగే కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. వామపక్షాల కూటమితో సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాం’’ అని రాఘవులు  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement