
తిరుపతి కల్చరల్: ప్రజల సమస్యలపై తక్షణం స్పందించే ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని, సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు అమోఘమని ప్రజా కళాకారుడు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ సినిమా రెండోసారి విడుదల నేపథ్యంలో తిరుపతికి విచ్చేసిన ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించి ఆదుకోవాలని ఇటీవల ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిపారు.
ఏలేరు, టన్వా రిజర్వాయర్‌లను అనుసంధానం చేస్తూ ఏలేరు కాల్వను మరింత విస్తరించి మెట్ట ప్రాంతానికి పొడిగించడం ద్వారా నీటి కష్టాలు తీర్చాలని కోరినట్లు తెలిపారు. తాను సమస్య చెప్పగానే ముఖ్యమంత్రిగా ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అప్పటికప్పడే సంబంధిత ఇంజనీర్లను పిలిచి ఇది ప్రజా సమస్య కనుక తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలు, రైతులను ఆదుకోవాలని చెప్పడం మహద్భాగ్యమన్నారు. తనతో పాటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాల నేతల కోరిక మేరకు నవంబర్ మూడో వారంలో తాను నటించిన ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నట్లు నారాయణమూర్తి తెలిపారు.