ప్రైవేటు ఫీజులుం

Private School Fees Collecting For Tenth Exams - Sakshi

పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో దోపిడీ

కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల నిర్వాకం

అసలు ఫీజుకు పదింతలు వసూలు! ∙పట్టించుకోని విద్యాశాఖాధికారులు

శ్రీకాకుళం: జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు పరీక్ష ఫీజుల పేరుతో దోపిడీకి తెరతేశాయి. ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకం కావడంతో తల్లిదండ్రులు కూడా ఆయా పాఠశాలల యాజమాన్యాలు చెప్పినంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. వీరి బలహీనతను గుర్తించిన యాజమాన్యాలు పదో తరగతి పరీక్ష ఫీజులను తమకు అనుకూలంగా మలచుకొని తల్లిదండ్రుల జేబులను గుల్లచేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు ఎనిమిది నుంచి పది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125 లు మాత్రమే కాగా, పలు పాఠశాలలు వెయ్యి రూపాయలు నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. పరీక్ష ఫీజు మొత్తం ఎంతో తెలియని తల్లిదండ్రులు వారు అడిగినంత ఇచ్చేస్తున్నారు.

కొందరు తెలిసిన వారు మాత్రం అంత మొత్తం ఎందుకని అడిగినప్పుడు పరీక్షల సమయంలో సహకరించేందుకు విద్యాశాఖలోని పలువురికి చెల్లింపులు జరపాల్సి ఉంటుందని చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా మౌనం వహించడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరంలో ప్రారంభంలో ట్యూషన్‌ ఫీజుతో పాటు, పుస్తకాలు, యూనిఫాం అంటూ వేల రూపాయల్లో వసూళ్లు చేసిన కొన్ని యాజమాన్యాలు వార్షికోత్సవాల ను సైతం విద్యార్థుల నుంచి వసూళ్లు చేసే నిర్వహిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఫీజు దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top