ఉపాధ్యాయ దినోత్సావాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయిలో ఇచ్చే అవార్డులకు ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా ప్రకటనలో విద్యాశాఖ వైఖరి ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ రేపింది.
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ దినోత్సావాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయిలో ఇచ్చే అవార్డులకు ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా ప్రకటనలో విద్యాశాఖ వైఖరి ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ రేపింది. జాబితాను శుక్రవారం సాయంత్రం వరకు ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హతలు, నిర్ధేశాల మేరకు ఎంపిక చేసిన జాబితా శుక్రవారం ఉదయానికే సిద్ధమయింది. అయితే దాన్ని ప్రకటించకుండా గోప్యత పాటించారు. రాజకీయ ఒత్తిళ్లతో తుదిజాబితాను మార్చడానికే ప్రకటించడంలేదని ఉపాధ్యాయ వర్గాలు అనుమాన పడుతున్నాయి.
జాబితాను బహిరంగంగా ప్రకటించకుండా శుక్రవారం రాత్రి గ్రహీతలకు నేరుగా ఫోన్‌చేసి చెప్పినట్టు సమాచారం. ఇలా రహస్యంగా తెలియజేయడంలో ఆంతర్యమేంటని ఉపాధ్యయవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జిల్లాలో కనీసం 15 ఏళ్ల సర్వీసులో ఆదర్శ సేవలందించిన వివిధ కేడర్‌కు చెందిన 28 మందిని ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. అయితే ఎంపికైన ఉపాధ్యాయుల పేర్లు, వివరాలను తెలిపేందుకు ఆయన నిరాకరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో సత్కరిస్తామని డీఈఓ తెలిపారు.