అన్నీ కోతలే!

అన్నీ కోతలే! - Sakshi


వదలని విద్యుత్ కోతలు

నీటి మూటలైన  పాలకుల మాటలు

కనీసం కోతల వేళలు తెలియక జనం ఇబ్బందులు

 


వేసవిలో విద్యుత్ కోతలు ఉండవని, 24 గంటలూ సరఫరా ఇస్తామని చెప్పిన పాలకులు, అధికారుల మాటలు వట్టి ‘కోత’లేనని తేలిపోయింది. నాలుగు రోజులుగా జిల్లా  ప్రజలు  విద్యుత్ కోతలతో ఇబ్బందులకు గురవుతున్నా పరిస్థితిని ఇప్పటికీ సాధారణ స్థితికి తీసుకురాలేకపోయారు. కనీసం కోతల వేళలను కూడా ప్రకటించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.

 

 

సాక్షి, విశాఖపట్నం:
జిల్లా ప్రజలను విద్యుత కష్టాలు వీడటం లేదు. నాలుగు రోజుల క్రితం కలపాకలోని 400 కేవీ ట్రాన్స్‌కో విద్యుత్ ఉప కేంద్రంలో బస్ బార్ దెబ్బతినడంతో మొదలైన విద్యుత్ కష్టాలు బుధవారం కూడా కొనసాగాయి. రెండో రోజు 220 కేవీ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మూడో రోజు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన 220 కేవీ సబ్‌స్టేషన్ పాడయింది. నాలుగో రోజు అదే సబ్‌స్టేషన్‌లో మెయింటెనెన్స్ కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ సరఫరా నిలిపివేశారు. దీంతో ఈ నాలుగు రోజులు విశాఖ, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధి వరకూ అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ కోతలు అమలు చేశారు.





కనీస సమాచారం కరువు

నాలుగు రోజుల్లో దాదాపు 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా ప్రజలకు ఒక్క మాట చెప్పడం లేదు. వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.   ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. దీంతో జనం రాత్రి పగలూ విద్యుత్ కోతలతో విసిగిపోతున్నారు. అర్ధరాత్రి తమ దగ్గర్లోని విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి విచారిస్తే తమకేమీ తెలియదని, గాజువాక వెళ్లి ట్రాన్స్‌కో వాళ్లని అడగండని ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది బదులిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పవర్‌గ్రిడ్ నిరా్వాహకులు ఎలాంటి సమాచారం ఇవ్వనందువల్ల తామేమీ చెప్పలేమని ఏపీ ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు. దీంతో ఎక్కడా ప్రజలకు కోతలకు సంబంధించినసమాచారం రావడం లేదు.



 ఎప్పటికి తీరేను?

దేశంలోనే అత్యంత తక్కువగా 1.75 శాతం ట్రాన్స్‌మిషన్ నష్టాలు కలిగిన విశాఖ ఏపీ ట్రాన్స్‌కోను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో దీనికి ప్రస్తుతం 52 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. కానీ స్మార్ట్ సిటీగా, పారిశ్రామిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖ జిల్లాకు ఇవేమీ సరిపోవు.  విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులో భాగంగా కాపులుప్పాడలో 132 కేవీ, ఓజోన్‌వేలి, అచ్యుతాపురంలో 220 కేవీ, నక్కపల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) కూడా సిద్ధమైంది. కానీ దీనికి ఏషియన్ బ్యాంకు నుంచి నిధులు రావాల్సి ఉంది. అవి ఎప్పుడు వస్తాయో, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో  పాలకులకు, అధికారులకే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందా.   ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను పెంచుకుంటే తప్ప విద్యుత్ కోతల నుంచి శాశ్వత విముక్తి దొరకదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top