పవర్ కట్‌తో పాట్లు | Power cut in Kakinada | Sakshi
Sakshi News home page

పవర్ కట్‌తో పాట్లు

May 21 2014 2:37 AM | Updated on Sep 2 2017 7:37 AM

పవర్ కట్‌తో పాట్లు

పవర్ కట్‌తో పాట్లు

విద్యుత్ కోతతో కాకినాడ ప్రభుత్వాస్పత్రి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు కరెంటు వస్తుందో, స్కానింగ్ ఎప్పుడు తీస్తారో అని గంటల తరబడి రోగులు, గర్భిణులు ఎదురు చూడాల్సి వస్తోంది.

 కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :విద్యుత్ కోతతో కాకినాడ ప్రభుత్వాస్పత్రి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు కరెంటు వస్తుందో, స్కానింగ్ ఎప్పుడు తీస్తారో అని గంటల తరబడి రోగులు, గర్భిణులు ఎదురు చూడాల్సి వస్తోంది. జీజీహెచ్‌లోని అవుట్‌పేషెంట్ విభాగానికి ప్రతి రోజూ సుమారు 3000 మంది రోగులు వస్తుంటారు. ఇది వెయ్యి పడకల బోధనాస్పత్రి అయినప్పటికీ దాదాపు 1500 మంది ఆస్పత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కరెంట్ పోయినప్పుడు రోగులు నరకం అనుభవిస్తున్నారు. రోగులకు నిత్యం స్కానింగ్, ఎక్స్‌రే వంటివి తీయాల్సి ఉంటుంది. దీనికి విద్యుత్ అవసరం. రేడియాలజీ విభాగంలో కలర్ డాప్లర్ ద్వారా ప్రతి రోజూ ఐదుగురికి, యాంటీ నటాల్ ద్వారా సుమారు 80 మందికి, అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా సుమారు 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ వచ్చి పోతుండడంతో ఎక్స్‌రే, స్కానింగ్ యంత్రాలు సక్రమంగా పనిచేయలేదు. దూరప్రాంతాల నుంచి వచ్చిన రోగులు, గర్భిణులు, వారి సహాయకులు ఇబ్బందులనెదుర్కొన్నారు.
 
 జనరేటర్లే దిక్కు
 జీజీహెచ్‌లోని ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లకు జనరేటర్లే శరణ్యమయ్యాయి. ఆస్పత్రిలో 125 కేవీ సామర్ధ్యం కలిగినవి రెండు, 75 కేవీ, 50 కేవీ జనరేటర్లు ఒక్కోటీ ఉన్నాయి. విద్యుత్ కోత విధించినపుడు ఆ జనరేటర్ల ద్వారా ఐసీయూలు, ఆపరేషన్‌లకు విద్యుత్ అందిస్తుంటారు. వాటిలో 50 కేవీ జనరేటర్‌ను పూర్తిగా బ్లడ్‌బ్యాంకుకు అనుసంధానం చేశారు. నాలుగు జనరేటర్లు పనిచేస్తే గంటకు 50 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. అంతభారం భరించలేక ఆస్పత్రిలో విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకట బుద్ధ ఉన్నతాధికారులకు నివేదించారు. దానికి స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు సర్జికల్ బ్లాకు వెనుక భాగంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇది జరిగి సుమారు ఆరు నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు.
 
 ప్రతిపాదనలు పంపాం
 కాకినాడ జీజీహెచ్‌కు వచ్చే రోగులు, క్షతగాత్రులకు 24 గంటలూ సేవలందించేందుకు విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపాం. వారు వచ్చి స్థల పరిశీలన కూడా చేసి వెళ్లారు. సబ్ స్టేషన్ ఏర్పాటుతో రోగులు, క్షతగాత్రులకు విద్యుత్ కోత నుంచి ఉపశమనం లభిస్తుంది.  
 -డాక్టర్ పి. వెంకట బుద్ధ, జీజీహెచ్ సూపరింటెండెంట్

 ఆమోదం పొందింది  
 జీజీహెచ్‌లో సబ్ స్టేషన్ ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనను ఉన్నతాధికారులు ఆమోదించారు. అయితే బడ్జెట్ విడుదల కావాల్సి ఉంది. బడ్జెట్ విడుదలైన వెంటనే పనులను ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఆస్పత్రిలో 5 ఎంవీఏ సామర్ధ్యం కలిగిన సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. అంచెలంచెలుగా దాని సామర్థ్యాన్ని పెంచుతాం.
 -టీవీఎస్‌ఎన్ మూర్తి, డీఈ, ట్రాన్స్‌కో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement