వీడిన వివాహిత హత్య మిస్టరీ

Police solve woman murder case mystery - Sakshi

రాంగ్‌ కాల్‌తో పరిచయం.. 

తరచూ ఫోన్‌లో సంభాషణ 

 యువకుడి కుటుంబంలో రేగిన చిచ్చు..

వదిలించుకునేందుకు హత్య

కూడేరు: శివరాంపేట వద్ద జాతీయరహదారి సమీపాన జరిగిన వివాహిత హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. కాల్‌ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. రాంగ్‌ కాల్‌ ఆధారంగా పరిచయమైన వ్యక్తే ఆమెను పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రసాద్‌రావు మంగళవారం కూడేరులో విలేకరులకు వెల్లడించారు. అనంతపురానికి చెందిన విజయలక్ష్మి (22) అనే వివాహిత సెల్‌కు నెలన్నర కిందట కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రుద్రేశ్‌ నుంచి రాంగ్‌ కాల్‌ వచ్చింది. బ్రేకప్‌ కావాల్సిన కాల్‌ను వారు కొనసాగించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తరచూ వీరు ఫోన్‌ చేసుకుంటూ మాట్లాడుకునే వారు. 

విజయలక్ష్మి నుంచి అతడికి వాట్సప్‌ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ పెరిగాయి. ఈ క్రమంలో రుద్రేశ్‌ భార్యకు అనుమానం వచ్చింది. తరచూ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండటం గమనించి ఆరా తీసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పదేపదే గొడవ జరిగేది. చివరకు విడిపోయే పరిస్థితికి దారి తీయడంతో రుద్రేశ్‌ ఆలోచనలో పడ్డాడు. ఇంతటి వివాదానికి కారణమైన విజయలక్ష్మిని దూరంగా ఉంచాలని అనుకున్నాడు. అది సాధ్యం కాకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఇందుకు పక్కా ప్రణాళిక రచించాడు. ఈ నెల ఐదో తేదీన విజయలక్ష్మిని అనంతపురం నుంచి తన ద్విచక్రవాహనంలో కూడేరు మండలం శివరాంపేట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ జాతీయరహదారి సమీపాన గుట్ట వద్ద మాటల్లో పెట్టి ఆమె గొంతుకు చున్నీతో బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు.

 అనంతరం ఆమెను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు బండరాయిని ముఖం మీద వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హత్య ఘటన ఏడో తేదీ వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాల్‌ డేటాను పరిశీలించగా.. రుద్రేశ్‌ అనే వ్యక్తికి ఎక్కువగా ఫోన్‌ చేసినట్లు బయటపడింది. ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top