దొంగ పోలీసు!  

A Police Officer Involved In Crime For Helps to Gamblers In tadipatri - Sakshi

మాజీ ఎమ్మెల్యేతో ఖాకీ దోస్తీ

పోలీసు దాడులపై ముందస్తు సమాచారం

తాడిపత్రికి వచ్చిపోతున్నా పట్టుకోలేని పోలీసులు 

చర్చనీయాంశంగా ‘పచ్చ’పోలీసు

క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో ఓ ఇంటి దొంగ పెత్తనం మితిమీరింది. జిల్లా పోలీసు బాస్‌ తనదైన శైలిలో అరాచక శక్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నా.. ఆ ప్రణాళిక సమాచారం దాడులకు ముందే నేరగాళ్లకు చేరిపోతోంది. గత ఎన్నికల సమయంలోనూ ఈ ‘పచ్చ’ పోలీసు ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఆయన పంథా ఇలాగే కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో అక్రమార్కుల పట్ల ఆయన చూపుతున్న ‘విశ్వాసం’ పోలీసు శాఖ పరువును బజారున పడేస్తోంది.  –సాక్షి ప్రతినిధి, అనంతపురం 

సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : నియోజకవర్గంలోని మట్కా డాన్‌ రషీద్‌తో పాటు క్రికెట్‌ బుకీలు దాడుల కంటే ముందుగానే అక్కడి నుంచి తప్పించుకుపోయారు. ప్రస్తుతం సదరు మట్కాడాన్‌ ఏకంగా గోవాలో మకాం వేశారు. పోలీసు శాఖ ఎంతో గోప్యంగా దాడులకు ప్లాన్‌ చేస్తున్నా.. సమాచారం అసాంఘిక శక్తులకు ముందుగానే చేరిపోతోంది. ఈ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మట్కా డాన్లు.. క్రికెట్‌ బుకీలు.. అసాంఘిక శక్తులకు ఆయనో సమాచార కేంద్రం. పోలీసు శాఖ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిపై దాడులు చేస్తుందో ముందుగానే తెలుసుకోవడం, సంబంధిత వ్యక్తులకు చేరవేసి తన పబ్బం గడుపుకోవడం గత కొంతకాలంగా జరిగిపోతోంది. మట్కా.. పేకాట.. బెట్టింగ్‌.. ఇతరత్రాలను సమూలంగా అరికట్టేందుకు జిల్లా పోలీసు బాస్‌ వాటి మూలాల్లోకి వెళుతున్నా, ప్రధాన నిర్వాహకులు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక సొంత శాఖలోనే ఓ లీకు వీరుడు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి మరీ దాడుల సమాచారం చేరవేస్తున్నట్లు సమాచారం.

ఫలితంగా.. తాడిపత్రి నియోజకవర్గంలోని మట్కా డాన్‌ రషీద్‌తో పాటు క్రికెట్‌ బుకీలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. గతంలో జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్‌లతో పాటు క్రికెట్‌ బుకీలు, గ్యాంబ్లర్ల భరతం పట్టేందుకు జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సిద్ధమయ్యారు. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లు, క్రికెట్‌బుకీల జాబితాను పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. జిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లోని కీలకమైన అధికారులకు మాత్రమే ఈ సమాచారం ఉంది. సదరు వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు? ఏ విధంగా పట్టుకోవాలనే పక్కా ప్లాన్‌ను కూడా అధికారులు వేసుకున్నారు. సిద్ధం చేసిన జాబితాలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు సమాచారాన్ని పోలీసు శాఖలోని ఓ లీకు వీరుడు నేరుగా ఆ మాజీ ఎమ్మెల్యేకే ఫోన్‌ చేసి చేరవేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు తప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.  

పలు ఫిర్యాదులు.. 
వాస్తవానికి ముందస్తుగా సమాచారాన్ని లీకు చేసిన ఆరోపణలను ప్రధానంగా ఒక పోలీసు అధికారి ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా సదరు పోలీసు అధికారిపై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అప్పట్లో పూర్తిగా  అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించారని కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరించి ప్రతీ సమాచారాన్ని చేరవేయడమే కాకుండా.. పార్టీ మారేందుకు ఎవరెవరు సిద్ధమవుతున్నారు? వారిని జారుకోకుండా చూసుకోవాలని కూడా సూచనలు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా పట్టుబడకుండా ఉన్న మట్కాడాన్‌ ప్రధానంగా గోవాలో మకాం వేయడంతో పాటు అప్పుడప్పుడూ తాడిపత్రికి కూడా వచ్చిపోతున్నారనే సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది. అయినప్పటికీ పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top