పోలవరం హెడ్‌వర్క్స్, హైడల్‌ కేంద్రాలకు ‘రివర్స్‌’ ప్రారంభం

polavaram project reverse tendering notification september 20 - Sakshi

రూ.4,987.55 కోట్ల అంచనా వ్యయంతో ఒకే ప్యాకేజీ కింద పనులు

బిడ్‌ దాఖలుకు తుది గడువు ఈనెల 20 ఉదయం 11లోపు

అధిక సంఖ్యలో కాంట్రాక్టు సంస్థలు పోటీ పడేలా టెండర్‌ నిబంధనల సడలింపు

ఈనెల 23న ప్రైస్‌ బిడ్‌.. అదే రోజు ఈ–ఆక్షన్‌ ద్వారా రివర్స్‌ టెండరింగ్‌

సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్ల అంచనా విలువతో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో టెండర్‌ డాక్యుమెంట్‌ను అప్‌లోడ్‌ చేసింది. గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచే డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 20వతేదీ ఉదయం 11 గంటల వరకు బిడ్‌ దాఖలు చేసుకోవచ్చు.

గత ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్టర్‌ చేసుకున్న కాంట్రాక్టు సంస్థలు మాత్రమే బిడ్‌ దాఖలు చేసుకోవాలనే నిబంధనను అడ్డుపెట్టుకుని నోటిఫికేషన్‌ జారీచేయక ముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపి టెండర్ల విధానాన్ని అపహాస్యం చేసింది. పోటీ లేకపోవడం వల్ల అధిక ధరలకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో ఖజానాపై తీవ్ర భారం పడింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో పోటీపడేలా దేశంలో ఎక్కడ రిజిస్టర్‌ చేసుకున్న కాంట్రాక్టు సంస్థలైనా సొంతంగా లేదా జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడి బిడ్లు దాఖలు చేసుకునేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిబంధనలను సడలించింది. బిడ్‌ దాఖలుకు అర్హత కలిగిన కాంట్రాక్టు సంస్థలు స్వీయ ధ్రువీకరణ హామీపత్రాన్ని సమర్పించాలి. తప్పుడు హామీపత్రం అందచేస్తే కాంట్రాక్టు సంస్థ బ్యాంకు గ్యారంటీ (అంచనా విలువలో 2.5 శాతం అంటే రూ.124.68 కోట్లు), ఈఎండీ(అంచనా విలువ ఒక శాతం అంటే రూ.49.87 కోట్లు)ని వెరసి రూ.174.55 కోట్లను జప్తు చేస్తారు.

► ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌లో నిర్వహించే రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ పారదర్శకతకు నిలువుటద్దంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
► ఈనెల 21న ఈఎండీ(ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌) అందజేయాలి. 23న ఆర్థిక బిడ్‌ తెరుస్తారు.
► అత్యంత తక్కువ ధరకు కోట్‌ చేసిన సంస్థను ఎల్‌–1గా ఎంపిక చేస్తారు.
► ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం ఎల్‌–1 సంస్థకే పనులు అప్పగించాలని కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీవోటీ)కి ప్రతిపాదన పంపి ఆమోదిస్తే టెండర్‌ను ఖరారు చేస్తారు.
► రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో ఎల్‌–1గా నిలిచిన సంస్థ పేరును గోప్యంగా ఉంచుతారు. కేవలం ఆ సంస్థ కోట్‌ చేసిన ధరను మాత్రమే టెండర్‌లో పాల్గొన్న మిగతా సంస్థలకు కనిపించేలా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
► ఎల్‌–1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన ధరనే అంచనా విలువగా పరిగణించి ఈనెల 23న మధ్యాహ్నం ఈ–ఆక్షన్‌ (రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తారు.
►  ఒక్కో స్లాట్‌ను 15 నిమిషాల చొప్పున విభజించి ఈ–ఆక్షన్‌ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే కాంట్రాక్టర్‌ ఎల్‌–1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన ధర కన్నా 0.5 శాతం తక్కువ కాకుండా కోట్‌ చేయాలి.
► ఈ–ఆక్షన్‌కు నిర్దేశించిన 2.45 గంటల సమయం ముగిశాక అత్యంత తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్‌–1గా, ఆ తర్వాత తక్కువ ధరకు కోట్‌ చేసిన వారిని ఎల్‌–2, ఎల్‌–3, ఎల్‌–4, ఎల్‌–5లుగా ఖరారు చేస్తారు.
► ఈఎండీని జప్తు చేసి ఎల్‌–2గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన ధరను అంచనా విలువగా పరిగణించి మళ్లీ ఈ–ఆక్షన్‌ నిర్వహిస్తారు.

టెండర్‌ షెడ్యూలు ఇదీ..
బిడ్‌ డాక్యుమెంట్‌ డౌన్‌లోడ్‌: ఈనెల 5న మధ్యాహ్నం 1 గంట నుంచి

బిడ్‌ల స్వీకరణ: ఈనెల 5న మధ్యాహ్నం 1 గంట తర్వాత

బిడ్‌ దాఖలుకు తుది గడువు: ఈనెల 20 ఉదయం 11 గంటల్లోగా

ప్రీ–బిడ్‌ మీటింగ్‌: ఈనెల 11న ఉదయం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్‌ హెడ్‌ వర్క్స్‌ ఎస్‌ఈ కార్యాలయంలో ప్రీ–బిడ్‌ సమావేశంలో వ్యక్తమైన

సందేహాల నివృత్తి: ఈనెల 16న

ప్రీ–క్వాలిఫికేషన్‌ స్టేజ్‌: ఈనెల 21న ఉదయం 11 గంటలకు

ఆర్థిక బిడ్‌ ఓపెన్‌: ఈ నెల 23న ఉదయం 11 గంటలకు

ఈ–ఆక్షన్‌(రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహణ: ఈ నెల 23న ఉదయం మధ్యాహ్నం 1 గంట తర్వాత

టెక్నికల్‌ బిడ్‌: అక్టోబర్‌ 1 టెండర్‌ ఖరారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top