గ్రీవెన్స్‌సెల్ రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఆశలతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. గ్రీవెన్స్‌సెల్ రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వివేక్‌యాదవ్
విజయనగరం గంటస్తంభం: గ్రీవెన్స్‌సెల్ రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఆశలతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. గ్రీవెన్స్‌సెల్ రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వివేక్‌యాదవ్ పేరుతో సోమవారం ఓ ప్రకటన విడుదలైంది. పత్రికలు చదవలేని వారు, సోమవారం ఉదయం పత్రిక చూడని వారు యథావిధిగా తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే, కొందరు అధికారులు అందుబాటులో ఉండడంతో వినతులు స్వీకరిస్తారని వేచి చూశారు. ఎప్పటికీ అధికారులు స్పందించడంతో నిరాశతో ఇంటిబాట పట్టారు.
వ్యయప్రయాసలకు గురయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశాఖపట్నంలో ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించడంతో గ్రీవెన్స్‌సెల్ రద్దు చేసినట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ సమావేశానికి కలెక్టర్‌తో పాటు డీఆర్వో మాత్రమే వెళ్లారు. జేసీ జిల్లాలోనే ఉన్నారు. ఆయన స్థానికంగా జరిగిన పోలింగ్ సిబ్బంది అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జేసీ–2 నాగేశ్వరరావు కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. గతంలో జేసీ–2, డీఆర్వో ఉన్నా... ఇద్దరిలో ఒకరున్నా గ్రీవెన్స్‌సెల్ నిర్వహించేవారు. వీరికి డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు, ఇతర ఉప కలెక్టర్లు సహకారం అందించిన సందర్భాలున్నాయి.
కేఆర్సీ ఎస్డీసీ ఒక్కరే గ్రీవెన్స్‌సెల్ నిర్వహించిన సందర్భం కూడా జిల్లాలో ఉంది. సోమవారం కూడా కొంతమంది అధికారులు అందుబాటులో ఉన్నా నిర్వహించకపోవడంపై జనం ఆందోళన వ్యక్తంచేశారు. రెండుమూడు రోజుల ముందే గ్రీవెన్స్‌సెల్ రద్దుచేస్తున్నట్టు ప్రకటన ఇస్తే ఒకరి నుంచి ఒకరికి గ్రామీణ ప్రజలకు సమాచారం చేరేది. అదే రోజు ప్రకటన ఇవ్వడంతో దూర ప్రాంతాలకు చెందిన వారు పత్రికలు చూడకుండానే ఇంటి నుంచి బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్ ఫోర్టుకో వద్ద కూర్చున్నారు. 11 గంటలైనా అధికారులు రాకపోవడంతో కారణంపై ఆరా తీశారు. రద్దుచేసినట్టు తెలుసుకుని ఇంటిబాట పట్టారు. కనీసం ఫిర్యాదుల నమోదు కేంద్రం వద్ద తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఇంటిబాట పడ్డారు.