సార్లూ.. కదలండి! | People facing problems with indiramma housing | Sakshi
Sakshi News home page

సార్లూ.. కదలండి!

Dec 9 2013 12:41 AM | Updated on Aug 11 2018 8:06 PM

పేదలకు సొంత ఇల్లు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలలో ఒకటి.

 యాచారం, న్యూస్‌లైన్ : పేదలకు సొంత ఇల్లు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలలో ఒకటి. నిలువ నీడ లేని వారందరికీ గూడు కల్పించాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మాల్ గ్రామంలో 2008 సంవత్సరంలో 271మందికి సర్వే నంబర్ 569లో 40 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. 2009 సంవత్సరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. ఇందిరమ్మ పథకం తొలి విడతలో మాల్ గ్రామాన్ని ఎంపిక చేశారు.
 
 అర్హులుగా ఎంపిక చేసిన 271మందికి ఒకే చోట స్థలాలు, ఇళ్లు మంజూరయ్యాయి. దీనికి ఇందిరమ్మ కాలనీగా పేరు పెట్టారు. ఈ కాలనీలో వసతుల కల్పన కోసం నిధులు కూడా మంజూరయ్యాయి. వెంటనే 150మందికి పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. సకాలంలో బిల్లులు అందడంతో 40మందికి పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ హఠాన్మరణంతో ఇందిరమ్మ కాలనీని, ఇళ్ల నిర్మాణాలను అధికారులు పట్టించుకోవడం మానేశారు. బిల్లులు అందకపోవడం తదితర సమస్యలతో చాలామంది ఇళ్ల నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపివేసుకున్నారు. ఇక ఇల్లు కట్టుకున్నా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో కొంతమంది సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని అర కిలోమీటర్ దూరం నుంచి వైర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు అంధకారంలోనే మగ్గుతున్నారు.
 
 ఖర్చు కాని రూ.55లక్షల నిధులు
 మాల్ ఇందిరమ్మ కాలనీలో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ తదితర వసతుల కల్పన కోసం ప్రభుత్వం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.50లక్షల నిధులు మంజూరు చేసింది. కాలనీకి విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖకు రూ.5లక్షలను గృహ నిర్మాణ శాఖ చెల్లించింది. ఈ మేరకు కాలనీకి 40 స్తంభాలను పంపించిన అధికారులు, తీగలు బిగించడం మర్చిపోయారు. దీంతో స్తంభాలు దొంగల పాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో మంజూరైన నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు కావడం లేదు.
 
 బిల్లు రాక నిర్మాణం నిలిపేశాం
 ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలిసి సంతోషపడ్డాం. రూ.50వేలు అప్పు చేసి ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టాం. బిల్లు కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాం. కులం పేరు తప్పు పడింది, సరిచేస్తామంటున్నారు తప్ప బిల్లు ఇవ్వడం లేదు. దీంతో ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.
 - గునుగంటి శోభ, ఇందిరమ్మ కాలనీ
 
 ఇళ్ల ఎదుటే మురుగు నీరు
 కాల్వలు లేక మురుగు నీరు ఇళ్ల ఎదుటే నిలుస్తోంది. కంపు భరించలేక పోతున్నాం. రాత్రిపూట ఈగలు, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. వీధి దీపాలు లేకపోవడంతో బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. రోడ్లు, డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా స్పందించడం లేదు.
 - జి.వసంత, ఇందిరమ్మ కాలనీ
 
 అధికారులకు శ్రద్ధ లేదు
 వైఎస్ హయాంలో పేదలు ఇళ్లు నిర్మించుకున్న వెంటనే బిల్లులు వచ్చేవి. కాని నేడు ఆ పరిస్థితి లేదు. రూ.లక్షల నిధులు అందుబాటులో ఉన్నా వసతులు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం పేదలకు శాపంగా మారింది. చాలామంది ఇళ్లు కట్టుకోవడం లేదు.
 - చిన్నోళ్ల పద్మజ, సర్పంచ్, మాల్
 
 అన్ని శాఖల అధికారులు స్పందించాలి
 మాల్‌లోని ఇందిరమ్మ కాలనీకి విద్యుత్ సరఫరా కోసం ఆ శాఖకు రూ.5లక్షల డీడీ ఇచ్చాం. కానీ నేటికీ విద్యుత్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. అన్ని శాఖల అధికారులు కృషి చేస్తే కాలనీవాసుల సమస్యలు పరిష్కారమవుతాయి.
 -కరుణాకర్‌రెడ్డి, హౌసింగ్ ఏఈ, యాచారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement