సంక్షేమ పథకాలు అందక ప్రజలకు ఇబ్బందులు | People facing problems not receiving welfare schemes | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు అందక ప్రజలకు ఇబ్బందులు

Oct 10 2013 6:49 AM | Updated on Sep 1 2017 11:31 PM

జిల్లా పాలనా యంత్రాంగంలో అతిముఖ్యమైన పాత్ర పోషించే రెవెన్యూ శాఖ అధికారుల దీర్ఘకాలిక సెలవులు, పలు పోస్టుల ఖాళీలతో అస్తవ్యస్తంగా మారింది.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పాలనా యంత్రాంగంలో అతిముఖ్యమైన పాత్ర పోషించే రెవెన్యూ శాఖ అధికారుల దీర్ఘకాలిక సెలవులు, పలు పోస్టుల ఖాళీలతో అస్తవ్యస్తంగా మారింది. డీఆర్వో జయరామయ్య నెల రోజులుగా సెలవులో ఉండగా, మరికొంత మంది అధికారులు ఆయన బాటనే పట్టారు. ఈ శాఖలో వందల కొద్దీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రేషన్ కార్డులు, ఆధార్, ఓటు హక్కు నమోదు, జనణ, మరణ ధ్రువీకరణతో పాటు, భూమి కొలతలు, పౌరసరఫరాలు, భూసేకరణ, నాలా, ప్రకృతి వైపరీత్యాలు, ఆపద్బంధు, మీ-సేవ  తదితరాలకు సంబంధించి రెవెన్యూ అధికారుల పాత్ర కీలకం. అలాంటి రెవెన్యూ శాఖలో అధికారుల లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీర్ఘకాలికంగా ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పాలన అటకెక్కింది. పలు మండలాల్లో తహశీల్దార్‌తో పాటు డిప్యుటీ తహశీల్దార్‌లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు, టైపిస్ట్‌లు, వీఆర్వో, వీఆర్‌ఏల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 
 దీంతో గ్రామాలు, పట్టణాల్లో ఈ శాఖలో పనులు కుంటుపడుతున్నాయి. ఒక్కో వీఆర్వో మూడు, నాలుగు గ్రామాలకు ఇన్‌చార్జి కొనసాగుతున్నారు. దీంతో గ్రామాల్లో రైతులకు సకాలంలో రుణాలు, విత్తనాలు అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. తహశీల్ కార్యాలయంలో ఎమ్మార్వోతో పాటు, సెక్షన్ సూపరింటెండెంట్ ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం డీఆర్వో జయరామయ్య సెలవులో ఉన్నారు. ఈయన బాధ్యతలను ఏజేసీ శేషాద్రి చూస్తున్నారు. నిజామాబాద్ ఆర్డీఓ, జిల్లా రెవెన్యూ కార్యాలయంలో సూపరింటెండెంట్, నిజామాబాద్ మండలంలో మూడు వీఆర్‌ఓ పోస్టుల్లో ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. జక్రాన్‌పల్లి మండలంలో 16 గ్రామాలకు గాను ఐదుగురు వీఆర్వోలు, డిచ్‌పల్లి మండలంలో 19 గ్రామాలకు ఆరుగురు వీఆర్వోలు పనిచేస్తున్నారు. ఇలా ప్రతి మండలంలో రెవెన్యూశాఖలో ఖాళీలు దర్శనమిస్తున్నాయి.ప్రస్తుతం జిల్లాలో ఆర్‌ఐల పోస్టులు 32, జూనియర్ అసిస్టెంట్‌లు 44, టైపిస్టులు 34, వీఆర్వోలు 212, వీఆర్‌ఏలు 136 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తేగానీ రెవెన్యూ పాలన గాడిలో పడేలా కనిపించడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement