ఏ దిక్కూ లేనివారికి కాస్తోకూస్తో ఆసరాగా ఉంటుందనుకున్న ప్రభుత్వ పింఛన్లపైనా ఆంక్షల పర్వం మొదలైంది.
సాక్షి, ఒంగోలు: ఏ దిక్కూ లేనివారికి కాస్తోకూస్తో ఆసరాగా ఉంటుందనుకున్న ప్రభుత్వ పింఛన్లపైనా ఆంక్షల పర్వం మొదలైంది. ప్రతీనెలా అందే పింఛన్ల కోసం ఎదురుచూసే పండుటాకులకు నిరాశే ఎదురవుతోంది. పంపిణీలో జరుగుతోన్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సంస్కరణలు మొదలుపెట్టామని చెబుతున్న అధికారులు..లబ్ధిదారుల ఇక్కట్లపై దయ చూపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంస్కరణలతో ఇక్కట్లు: పింఛన్ల పంపిణీని గతంలో ‘ఫినో’ సంస్థ చేపట్టేది. నెలవారీగా వృద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. అభయహస్తం కింద లబ్ధిదారులకు కూడా నెలకు రూ.200 పంపిణీ చేస్తున్నారు. అయితే, ఫినోసంస్థ చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చాలావరకు అవకతవకలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి. దీంతో తాజాగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి.. బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల సమాచార సేకరణ పేరిట పింఛన్ల పంపిణీపై ఆంక్షలు విధించారు. చెల్లింపులను పూర్తిగా బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల ద్వారానే చేయాలని నిర్ణయించారు. ఈ విధానం నేపథ్యంలో జిల్లాలో వేలాదిమంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. మండే ఎండల్లో వృద్ధులు బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అలసిపోతున్నారు. ఇచ్చే అరాకొరా పింఛన్‌కు వందరకాల ఆంక్షలు పెడుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
17 వేల మందికి పింఛన్ల నిలుపుదల
జిల్లాలో సామాజిక పింఛన్లు అందుకునే వారు గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆంక్షలతో తిప్పలు పడుతున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల పింఛన్ల విడుదలలో జాప్యం జరిగింది. గత రెండు నెలలు ఎన్నికల నియమావళి అమలు కావడం, అధికారులంతా ఆ ఎన్నికల విధుల్లో బిజీగా మారడం..గవర్నర్ పాలన కొనసాగుతోన్న నేపథ్యంలో నిధుల విడుదలలో సమస్యలు తలెత్తాయి. నిధుల సర్దుబాటుకు సమయం పట్టడంతో లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పింఛన్లు పంపిణీ చేయలేకపోయారు. జిల్లాలో మార్చినెలలో 3,09,514 మంది సామాజిక పింఛన్లు పొందారు. వీరిలో 2,92,514 మందికి పంపిణీ చేశారు. మరో 17 వేల మంది బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోలేదనే కార ణంతో పింఛన్లు అందివ్వలేదు. ఏప్రిల్, మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీలో భారీ కోత పడింది.
సమస్యగా మారిన వేలిముద్రల సేకరణ
గతంలో పింఛన్ల పంపిణీని ప్రత్యక్షంగా ‘ఫినో’ సంస్థ సిబ్బంది లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. అటువంటిది, తాజాగా బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టి లబ్ధిదారులు చేతివేలి ముద్రలను సేకరించి.. వ్యక్తిగత పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. అయితే, గ్రామాల్లో చాలామంది లబ్ధిదారులకు బయోమెట్రిక్ పద్ధతిన సమాచార సేకరణపై అవగాహన లేకపోవడం.. పోస్టల్ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. పట్టణాల్లో ఐసీఐసీఐ బ్యాంకుల ద్వారా పింఛన్‌లిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పోస్టల్ కార్యాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
పోస్టల్ కార్యాలయాలు అందుబాటులో లేని 198 ప్రాంతాల్లో కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్స్(సీఎస్‌పీ)లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రకరకాల కారణాల నేపథ్యంలో ప్రతీనెలా 15 వేల మంది నుంచి 17 వేల మంది వరకు పింఛన్లు అందుకోలేకపోతున్నారు. కొందరు చేతివేలి గుర్తులు స్పష్టంగా లేకపోవడం, వణుకుతున్న చేతులతో వృద్ధుల నుంచి సమాచారం సేకరణ సక్రమంగా కుదరక పింఛన్ల పంపిణీ కష్టమైందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మే నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పలు జాగ్రత్తలు చేపట్టి లబ్ధిదారులకు న్యాయం చేయగలమని డీఆర్‌డీఏ పీడీ ఎ.పద్మజ పేర్కొన్నారు.