అనారోగ్యశ్రీ | Sakshi
Sakshi News home page

అనారోగ్యశ్రీ

Published Thu, Mar 6 2014 1:11 AM

patients not beliveing with aarogyasri scheme

 బొబ్బిలి, న్యూస్‌లైన్: రోజురోజుకూ ఆరోగ్యశ్రీ మీద పేద రోగులకు నమ్మకం సడలిపోతోంది. వైద్యం కోసం ఎంతో ఆశతో వెళ్లగా రోగం తగ్గక పోగా  ఎక్కువైపోతోంది. ఇందుకు ఉదాహరణే రామభద్రపురానికి చెందిన బాధితుడు జగన్నాథం. ట్రాక్టర్ నుంచి జారి పడి మూత్రం బంధించడంతో బాధపడుతున్న ఈ యువకుడిని ఆరోగ్య శ్రీ పథకం ఆదుకోలేకపోయింది సరికదా ఆ యువకుడికి బాధ మరింత ఎక్కువైంది.
 
 దీంతో ఉన్నత వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ వైద్యులు ఉచిత సలహా పారేసి చేతులెత్తేశారు. రామభద్రపురం మండల కేంద్రంలోని కూరాకుల వీధికి చెందిన పొం దూరు జగన్నాథం అనే యువకుడు గత ఏడాది వినాయకచవితి ఉత్సవాల ముగింపు వేడుకల్లో ట్రాక్టర్‌పై నుంచి జారి పడ్డాడు. అప్పటికప్పుడు ప్రథమ చికిత్స అందించారు. ఆ తరువాత మూడు రోజులకు మూత్రం బంధించి ప్రాణాల మీదకు రావడంతో వెంటనే జిల్లా కేంద్రంలో ఆరోగ్యశ్రీతో సంబంధముం డే నెట్‌వర్క్ ఆస్పత్రికి అక్కడ ఆరోగ్యమిత్ర పంపారు.
 
 దాంతో అక్టోబరు 16న మూత్రానికి సంబంధించి ఆపరేషన్ చేసి ప్రత్యేకంగా మూత్రం పోవడానికి గొట్టాలు అమర్చారు. అదే నెల 23న ఆస్పత్రి నుంచి ఇంటికి పంపేసి రివ్యూ కోసం వారం, 15 రోజులకు ఒకసారి రమ్మని సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అని ప్రభుత్వం ప్రకటనలతో ఉదరగొట్టినా జగన్నాథానికి స్కానింగ్, యూరినల్ బ్యాగులు, మందుల పేరుతో దాదాపు రూ.30 వేల వరకూ ఖర్చు పెట్టించారు.
 
 నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే జగన్నాథం ఇలా మంచాన పడడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బం దుల్లోకి వెళ్లింది. దానికి తోడు ఉచితంగా అందాల్సిన వైద్యానికి వేల రూపాయలు ఖర్చయ్యేసరికి మరిన్ని ఇక్కట్లు ఎక్కువయ్యాయి. వేలాది రూపాయలు ఖర్చయినా వచ్చిన బాధ మాత్రం తీరలేదు. అదేసమస్య మళ్లీ రావడంతో ఇక ఇక్కడ వైద్యం చేయలేమని, ఆపరేషన్ కోసం ముగ్గురు వైద్యులుండాలని, అందుకు హైదరాబాద్ వెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. అప్పటి  నుంచి బాధితుడు,కుటుంబసభ్యుల ఆవేదన ఎక్కువయ్యింది. ఇంట్లో ఉన్న సొమ్మంతా అయిపోయి ఇప్పుడు హైదరాబాద్ వెళ్లమంటే ఎలా అంటూ ఆం దోళన వ్యక్తంచేస్తున్నారు. తగ్గిపోయిందని డిశ్ఛార్జి చేశాక అదే వ్యాధి మళ్లీ ఎందుకు వచ్చిందో అర్థం కావ డం లేదని, వైద్యుల సమాధానం కూడా సరిగ్గా లేదని,  దీనిపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
 

Advertisement
Advertisement