కుమారుడు పట్టించుకోవడం లేదు..

Parents Complaint On Sons and daughters In Krishna - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి

కుమారుడికి కౌన్సెలింగ్‌

వీరులపాడు(నందిగామ): నాకు 75 ఏళ్ల వయసు.. నాకు ఎనిమిది మంది కుమార్తెలు.. ఇద్దరు కుమారులున్నారు. 15 ఏళ్లుగా కుమార్తెలే చూస్తున్నారు.. నాకున్న ఆస్తి కూడా చిన్న కుమారుడు వద్దే ఉంది.. ఆస్తి పంచుదామన్నా.. నన్ను చూడమన్నా వినటం లేదని.. దుర్భాషలాడుతున్నాడని తల్లి ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని జయంతి గ్రామానికి చెందిన దేశిబోయిన ఆదిలక్ష్మికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, 15 సెంట్ల ఇంటి స్థలం, 10 సెంట్ల దొడ్డి ఉంది. ఆమెకు ఎనిమిది మంది కుమార్తెలు.

ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈ ఆస్తులన్నీ చిన్న కుమారుడు శ్రీను వద్దనే ఉంటున్నాయి. కుమారులు, కుమార్తెలకు వివాహం చేశానని ఉన్న ఆస్తిని అందరికి సమానంగా పంచటంతో పాటు తనను చూసుకోవాలని అడిగితే చిన్న కుమారుడు తనపై దుర్భాషలాడటంతో పాటు దిక్కున్న చోట చెప్పుకో అంటూ మాట్లాడుతున్నాడని ఆదిలక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది. ఉన్న ఆస్తిలో ఇంటి స్థలం, దొడ్డిని శ్రీను అమ్ముకొన్నాడని వివరించింది. ఇద్దరు కుమారులు చూడటం లేదని అన్నయ్య కొండ చూస్తేనే నేను చూస్తానని చిన్న కొడుకు పేచీ పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకొంది. దీంతో స్పందించిన ఎస్‌ఐ లక్ష్మణ్‌ కుమార్తెలు, కుమారులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూడకుండా వదిలేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో కుమారులు తల్లిని చూసేందుకు అంగీకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top