లక్షల్లో ఖర్చులు.. వేలల్లో బిల్లులు | : Panchayat elections, the pressure on the authorities to submit details of expenditures. | Sakshi
Sakshi News home page

లక్షల్లో ఖర్చులు.. వేలల్లో బిల్లులు

Aug 23 2013 3:55 AM | Updated on Sep 1 2017 10:01 PM

పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వివరాలను సమర్పించాలని అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో అభ్యర్థులు కిందమీద పడుతున్నారు.

కోరుట్ల, న్యూస్‌లైన్ :పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వివరాలను సమర్పించాలని అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో అభ్యర్థులు కిందమీద పడుతున్నారు. లక్షల్లో ఖర్చుపెట్టి వేలల్లో చూపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలు పూర్తయిన 45 రోజుల్లోగా పోటీచేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను మండల పరిషత్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం అందించిన ప్రొఫార్మ ప్రకారం లెక్కలు చూపాలి. ఎన్నికలు ముగిసి ఇరవై రోజులు గడుస్తున్నా పది శాతం అభ్యర్థులు కూడా లెక్కలు సమర్పించనట్టు తెలుస్తోంది. గడువులోగా అందజేయాలని నోటీస్‌లు ఇచ్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అభ్యర్థులు తక్కువ లెక్కలు చూపేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు బంధుగణాన్ని సైతం ఉపయోగించుకుంటున్నారు. 
 
 నిబంధనలు..
 గత నెల 23, 27, 31 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం 10 వేలకు పైగా  జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.80 వేలు, వార్డు సభ్యులు రూ.10 వేలు, 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.40 వేలు, వార్డు సభ్యులు రూ.6 వేలు ఖర్చు చే యాలి. ఏకగ్రీవాలు మినహాయిస్తే జిల్లాలో 1149 పంచాయతీల్లో  సర్పంచులకు 9 వేలు, వార్డు సభ్యులకు 31 వేల మంది పోటీ చేశారు. వీరంతా 45 రోజుల్లోగా ఎన్నికల సమయంలో చేసిన ఖర్చుల వివరాలను అప్పగించాలి.
 
 తక్కువ చూపేందుకే మక్కువ..
 పంచాయతీ ఎన్నికల్లో కరపత్రాలు, పోస్టర్లు, ప్రచార సామగ్రి ముద్రణ, హోర్డింగ్‌లు, కటౌట్‌లు, ఫ్లెక్సీలు, వాహనాలు, ఆడియో, వీడియో క్యాసెట్లు, సభలు, సమావేశాలకు సంబంధించిన ఖర్చును అభ్యర్థులు తక్కువ చేసి చూపేందుకు సిద్ధమవుతున్నారు. వేలల్లో కరపత్రాలు ముద్రించి వందల్లో లెక్క చూపుతున్నారు. ప్రచారంలో తిరిగిన వారికి అయిన ఖర్చు లెక్కలే రాయడం లేదు. వాహనాలు అసలు ఉపయోగించలేదని, ఎన్నికల రోజు తమ మద్దతుదార్లకు టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేసిన అభ్యర్థులు అసలు వాటి లెక్కలే చూపడం లేదు. 
 
 లెక్క చూపకుంటే చిక్కులే
 ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు నిబంధనల ప్రకారం వ్యయపరిమితి లెక్కలు చూపాల్సిందే. లేకుంటే పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్(బి) ప్రకారం లెక్కలు చూపని అభ్యర్థి మూడేళ్ల పాటు పోటీ చేసేందుకు అనర్హులు. 45 రోజుల్లో లెక్కలు చూపకుంటే తన పదవిని కోల్పోతాడు. త్వరలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఉండడంతో లెక్క చూపకుంటే మళ్లీ పోటీ చేసే అవకాశం కోల్పోతామని భయపడుతున్నారు. ఎన్నికలు గడిచి ఇరవై రోజులు గడస్తున్నా వ్యయపరిమితి లెక్కలు సమర్పించని అభ్యర్థులకు ఎదురయ్యే చిక్కులపై వారం రోజుల క్రితం మండల పరిషత్ అధికారులు అవగాహన కల్పించారు.అయినప్పటికీ ఆశించిన రీతిలో అభ్యర్థులు లెక్కలు సమర్పించకపోవడంతో నోటీసులకు రంగం సిద్ధం చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement